Thieves Steal Shoes: చాలా మంది దొంగలు ఆలోచించేది ఒకటే. ఒక్క దొంగతనం చేస్తే లైఫ్ సెటిల్ కావాలి అనుకుంటారు. బాగా ధనవంతుల ఇళ్లకు.. లేదంటే, బ్యాంకులకు, ఏటీఎం సెంటర్లకు స్పాట్ పెట్టి.. అదేదో సినిమాలో వేణు మాధవ్ చెప్పినట్లు ధడేల్ మనిపిస్తే.. జీవితాంతం హాయిగా కూర్చొని తినవచ్చు అని భావిస్తారు. కానీ, దొంగలందరూ ఒకేలా ఆలోచించరు కదా. ఒక్కో దొంగ ఆలోచన ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగలు కూడా అలాంటి వారే. వీరికి కావాల్సింది విలువైన వస్తువులు కాదు.. కేవలం చెప్పులు, బూట్లు. చెప్పులు దొంగతనం చేయడం ఏంట్రా తింగరి సన్నాసులు అనుకుంటున్నారా? అయినా, మీరు విన్నది నిజం. నిజంగా ఈ దొంగల టార్గెట్ కేవలం చెప్పులే!
మూసారాంబాగ్ లో బూట్ల దొంగతనం
తాజాగా వెరైటీ దొంగల ముఠా హైదరాబాద్ మూసారంబాగ్ లోని నాలుగు అపార్ట్ మెంట్ లలో దొంగతనానికి పాల్పడ్డారు. అన్ని ఫ్లాట్ల ముందు ఉన్న బూట్లను చక్కగా బస్తాల్లోకి సర్దుకుని ఆటోలో వేసుకుని దర్జాగా వెళ్లిపోయారు. యశోద ఆసుపత్రిలోని డాక్టర్ డ్రెస్సింగ్ రూమ్ లోనూ బూట్ల దొంగతనం జరిగింది. అపార్ట్ మెంట్లలో దొంగిలించిన బూట్లలలో ఒక పోలీసు ఇన్ స్పెక్టర్, ఒక మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ కు చెందినవి కూడా ఉన్నాయి. పొద్దున్నే లేచి చూసే సరికి బూట్లు, చెప్పులు కనిపించకపోవడంతో అందరూ షాకయ్యారు. వెంటనే మలక్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆటోలో వచ్చి దర్జాగా దొంగతనం
బూట్ల దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్ట్ మెంట్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి బూట్లు, చెప్పులను దొంగిలించి పారిపోతున్నట్లుగా రికార్డు అయ్యింది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారికి ఇలా చుక్కలు చూపించండి.. సజ్జనార్ సలహా!
అటు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోని డాక్టర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సైతం బూట్ల దొంగతనం జరిగింది. ఓ యువకుడు బి-1 సెల్లార్ ప్రాంతం నుంచి హాస్పిటల్ లోకి వచ్చాడు. ఐదవ అంతస్తులోకి ప్రవేశించడానికి డాక్టర్ లిఫ్ట్ ను ఉపయోగించాడు. నెమ్మదిగా డాక్టర్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి అక్కడ సుమారు రూ. 4 వేల విలువ చేసే జత బూట్లను దొంగిలించాడు. ఆ తర్వాత హాస్పిటల్ ప్రాంగణంలో కొంత సమయం గడిపిన, బయటకు వెళ్లిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత, దొంగిలించబడిన బూట్లు ధరించి సదరు యువకుడు రాజ్ భవన్ రోడ్డు వైపు నడుస్తున్నట్లు గుర్తించారు ఆసుపత్రి సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 331(3), 305(a) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అటు ఈ చెప్పుల దొంగతనం ఘనటనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. దొంగల పరువు తీశారు దొంగనాయాళ్లు అని కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: మా ఆడోళ్లు తాగుబోతులయ్యారు.. కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తలు!