Japanese prisoner : మనం అనని మాటను అన్నామని ఎవరైనా అంటేనే మనం తట్టుకోలేము, అలాంటిది చేయని ఘోరమైన నేరాన్ని మోపి జైలులో పెడితే ఎలా ఉంటుంది. క్షణక్షణం మనస్సు వేధిస్తుంటుంది. అందుకే మన దేశంలో న్యాయవ్యవస్థలో ఓ మాట ఉంటుంది. వంద మంది నేరస్థులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ.. ఓ నిర్దోషికి కూడా అన్యాయంగా శిక్షపడకూడదు. కానీ.. చేయని నేరానికి ఏకంగా నాలుగు దశాబ్దాలకు పైగా మరణశిక్ష అనుభవించారో వ్యక్తి. తన తప్పు లేకున్నా, ఎలాంటి నేరం చేయకున్నా.. నలబై ఏళ్లుగా జైలులో మగ్గిపోయిన ఆ వ్యక్తికి.. ప్రభుత్వం నుంచి భారీ పరిహారం ఇవ్వాల్సింగా కోర్టు ఆదేశించింది. ఈ ఘటన జపాన్ లో జరిగింది. ఈ కేసు ఏంటో తెలుసా..
ప్రస్తుతం 89 ఏళ్ల వయసున్న ఇవావో హకమాడ.. 1966లో జరిగిన నాలుగు హత్యల కేసులో దోషిగా తేలాడు. దాంతో.. అతనికి జీవిత ఖైదు విధించారు. మాజీ ప్రొఫెషనల్ బాక్సరైన హకమడ నిర్దోషి అని.. అతని సోదరి, మద్దతుదారుల ఏళ్లుగా చేస్తున్న వాదన నిజమని 2024లో నిర్ధారణ అయ్యింది. నాలుగు దశాబ్దాల వాదనల తర్వాత కోర్టు అతని నిర్దోషిత్వాన్ని అధికారికంగా అంగీకరించి, విడుదల చేయాలని ఆదేశించింది. అతనికి శిక్ష విధించిన కేసులో పోలీసులు సాక్ష్యాలను తారుమారు చేశారని కనుగొంది.
అతను కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందడానికి వీలు లేదు.. అందుకే.. అతనికి ప్రభుత్వం భారీగా నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. అకారణంగా శిక్ష అనుభవించిన వ్యక్తికి ¥142 మిలియన్లు అంటే మన కరెన్సీలో రూ.20 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. ఎందుకంటే చేయని నేరానికి.. ప్రపంచంలోనే అత్యధిక కాలం మరణశిక్ష అనుభవించిన నిర్దోశి ఖైదీగా గుర్తింపు పొందాడు. అతను జైలులో గడిపిన 46 ఏళ్లల్లో ప్రతీ ఏడాది పరిహారం కింద ¥12,500 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇందులో.. అధిక భాగం.. అతనిపై అధికారులు, వ్యవస్థ చేసిన ఉరిశిక్ష బెదిరింపులకు పరిహారంగా ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
జీవితాన్ని ఎలా తిరిగిస్తారు
కోర్టు ఇవ్వాలని కోరిన మొత్తాన్ని అతను తిరస్కరించినట్లు.. అతని ప్రతినిధులు చెబుతున్నారు. ఎందుకంటే.. అతను అనుభవించిన అపారమైన బాధను ఎంత డబ్బు అయినా పూడ్చలేమని అంటున్నారు. కేవలం జైలులో ఉండడమే కాదు.. దశాబ్దాల పాటు ఒంటరితనంతో విసిగిపోయాడు, పైగా.. నిత్యం వెంటాడే ఉరిశిక్ష బెదిరింపులు అతడిని మానసిక తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రస్తుతం.. ఇవావో హకమాడ, ఊహాత్మక ప్రపంచంలో జీవిస్తున్నట్లుగా చెబుతున్నారు.
యుద్ధానంతర జపాన్‌లో పునర్విచారణకు అనుమతి పొందిన మరణశిక్ష పడిన ఐదో ఖైదీ హకమాడ కాగా.. అంతకు ముందు విచారణ చేపట్టిన నాలుగు కేసుల్లో కూడా వ్యక్తులు నిర్దోషిగా విడుదలయ్యాయి.
ఇవావో హకమడ శిక్షకు కారణం ఏంటి.?
ఇవావో హకమడ ఒక మాజీ ప్రొఫెషనల్ బాక్సర్, అతను 1961లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత జపాన్‌లోని షిజువోకా ప్రిఫెక్చర్‌లోని సోయాబీన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పనిచేశాడు. విడాకులు తీసుకుని, గారడీ ఉద్యోగాలు చేసిన అతను స్థానిక బార్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా కూడా పనిచేశారు. అయితే.. 1966లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన క్రూరమైన నేరానికి సంబంధించి అరెస్టు అయ్యాడు, అదే అతని జీవితాన్ని నాటకీయ మలుపు తిప్పింది.
జూన్ 30, 1966న, హకమడ పనిచేస్తున్న సోయాబీన్ ఫ్యాక్టరీ యజమాని, అతని భార్య, ఇద్దరు టీనేజ్ పిల్లలు వారి ఇంట్లో హత్యకు గురయ్యారు. నలుగురినీ కత్తితో పొడిచి చంపారు, ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో డబ్బులు కూడా మాయమయ్యాయి. ఆ సంవత్సరం ఆగస్టు 18న హకమడ పైజామాపై రక్తం, గ్యాసోలిన్ జాడలు కనిపించాయని పేర్కొంటూ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ రక్తం అతనిది కాకపోయినా, అది అతనికి నేరస్థులతో సంబంధం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మొదట్లో, హకమడ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది, కానీ తరువాత తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నాడు. ఆ ఒప్పుకోలు బలవంతంగా జరిగిందని అతను అనేక సార్లు వాదించారు. ఏడాది తర్వాత అంటే.. ఆగస్టు 1967లో, మిసో ట్యాంక్‌లో మునిగిపోయిన ఐదు రక్తపు మరకలున్న దుస్తులను కనుగొన్నారు. ఆ సాక్ష్యం తరువాత చాలా వివాదాస్పదమైంది. హకమాడ ఆ దుస్తులు తనవి కాదని ఖండించారు. కానీ అతని నిరసనలు ఉన్నప్పటికీ, షిజువోకా జిల్లా కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి 1968లో 2-1 తేడాతో మరణశిక్ష విధించింది. హకమడ నిర్దోషి అని నమ్మిన భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, తీర్పు వెలువడిన ఆరు నెలల తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. తీర్పును నిరోధించడంలో తను విఫలం అయినట్లుగా ఆయన బాధపడ్డారు.