పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఐస్ క్రీమ్ లను ఎంతో ఇష్టంగా తింటారు. వేసవిలో చల్లదనం కోసం మరింత ఎక్కువగా వీటిని తినేందుకు మొగ్గు చూపుతారు. కానీ, ఐస్ క్రీమ్ ల తయారీ కేంద్రాలు అత్యంత దారుణంగా ఉంటాయి. తరచుగా సోషల్ మీడియాలో ఐస్ క్రీమ్ తయారీ సెంటర్లకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతూనే ఉంటాయి. అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఐస్ తయారీలో ఉపయోగించే రంగులు, పదార్థాలు, నీళ్లు దారుణంగా ఉంటాయి. ఇక తాజాగా ఐస్ క్రీమ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐస్ క్రీమ్ తయారీలో అత్యంత ప్రమాదకరమైన డిటర్జెంట్ పౌడర్లు కలుపుతున్నట్లు గుర్తించారు.
ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లో ప్రమాదకర పదార్థాలు
గత కొద్ది రోజులుగా కర్నాట వ్యాప్తంగా ఫుడ్ సేప్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు ఐస్ క్రీమ్ సెంటర్ల మీద దాడులు నిర్వహిస్తున్నారు. క్రీమీ టెక్స్చర్ కోసం ఐస్ క్రీంలలో డిటర్జెంట్ పౌడర్ ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని దాదాపు సగం ఐస్ క్రీం, ఐస్ క్యాండీ, కూల్ డ్రింక్ తయారీ యూనిట్లు అపరిశుభ్రమైన పరిస్థితులలో నాణ్యత లేని ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తేలింది. ఇప్పటి వరకు 220 దుకాణాలు తనికీ చేయగా, 97 దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలు ఐస్ క్రీమ్ లను నిల్వచేయడంలో సరైన పద్దతులు పాటించడం లేదని FDA అధికారులు తెలిపారు. “తనిఖీలలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రీమీ టెక్స్చర్ సృష్టించడానికి ఐస్ క్రీంలలో డిటర్జెంట్ పౌడర్‌ను ఉపయోగిస్తున్నారు. ఎముకలను బలహీనపరిచే ఫాస్పోరిక్ ఆమ్లాన్ని కూల్ డ్రింక్స్ లో గుర్తించాం” అని తెలిపారు. అటు ఇప్పటి వరకు పలు తయారీ కేంద్రాలకు మొత్తం రూ.38,000 జరిమానా విధించినట్లు తెలిపారు.
సమ్మర్ కావడంతో పెరిగిన ఐస్ క్రీమ్ల వినియోగం
వేసవి ప్రారంభం కావడంతో ఐస్ క్రీంలు, శీతల పానీయాలకు డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే పిల్లలు సాధారణంగా తీసుకునే ఆహార నాణ్యత, తయారీ పద్ధతులను అంచనా వేయడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఐస్ క్రీమ్, కూల్ డ్రింగ్స్ తయారీ కేంద్రాలపై వరుస దాడులు నిర్వహిస్తున్నారు. కొన్నితయారీ కేంద్రాల్లో అపరిశుభ్రమైన, సరిగా మెయింటెనెన్స్ లేని పరిస్థితులను గుర్తించారు. ఐస్ క్రీమ్ ల తయారీ ఖర్చులను తగ్గించడానికి చాలా మంది డిటర్జెంట్, యూరియా, స్టార్చ్ తో తయారు చేసిన సింథటిక్ పాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తేల్చారు. అదనంగా, రుచి, రంగును పెంచడానికి సహజ చక్కెరకు బదులుగా సాచరిన్, అనుమతి లేని హానికర రంగులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. చాలా తయారీ యూనిట్లలో ఐస్ క్యాండీలు, కూల్ డ్రింక్స్ లో త్రాగడానికి పనికిరాని నీటిని ఉపయోగిస్తున్నట్లు గమనించారు. ఇప్పటి వరకు 590 హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు మెస్‌లను కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనికీ చేశారు. వీటిలో 214 రెస్టారెంట్లలో కనీస పరిశుభ్రత పాటించడం లేదని గుర్తించారు. ఆయా హోటళ్లు, రెస్టారెంట్లకు రూ. 1,15,000 జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: వ్యాన్ ఆపి, కోళ్లను కొన్న అనంత్ అంబానీ, నెట్టింట వీడియో వైరల్!