Viral Video : మనిషి ఎక్కడికి వెళ్లినా తన సహజ గుణాన్ని మార్చుకోడు. మిగతా జీవుల్ని హింసిస్తూ ఆనందించడం అలవాటు కావడంతో.. అదే ధోరణి కొనసాగిస్తున్నాడు. ఇందుకు ఉదాహరణే ఇటీవల ఓ అటవీలోనూ కనిపించింది. చిన్న కూనలతో అటవిలో తన దారిన తాను వెళుతున్న ఓ పులిని చుట్టుముట్టి.. గోలగోల చేశారు. ఒంటిగా ఉండి, పులి దగ్గరకు వెళ్లాలంటే ఒణికిపోతారు. కానీ.. గుంపుగా ఉండడంతో వారి చేష్టలకు అంతులేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొందరు.. వారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి హైకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును తీసుకోవడంతో పాటు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేమైంది అంటే..
మహారాష్ట్రలోని ఉమ్రేడ్-పౌని-కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో జీపుల్లో కొందరు టూరిస్టులు సఫారీ వాహనాల్లో అటవీలోకి వెళ్లారు. నాలుగైదు వాహనాల్లో గుంపుగా వెళ్లిన వారు అటవీలో సహజ వాతావరణంలో జంతువుల్ని చూడాలనుకున్నారు. అప్పటికే.. ఫోటోలు, వీడియోలతో హంగామా చేస్తున్నారు. సరిగా అదే సమయంలో.. వారికి ఓ పులి కనిపించింది. నాలుగు కూనలతో అటుగా వెళుతున్న పులిని చూసిన టూరిస్టులు కేరింతలు కొట్టారు. అన్ని జీపులన్ని ఒక్కచోటకి వచ్చి పులిని, దాని కూనల్ని చుట్టుముట్టాయి.
ఈ ఘటన డిసెంబర్ 31న జరిగినట్లు గుర్తించారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. దాంతో.. స్పందించిన జస్టిస్ నితిన్ సంబ్రే, జస్టిస్ వృషాలి జోషి ధర్మాసనం ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు విచారణ చేపట్టిన హైకోర్టు.. మహారాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటివ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసును జనవరి గురువారం నాటికి వాయిదా వేసింది.
పర్యాటకులు చుట్టుముట్టిన పులిని ఎఫ్ -2 గా, చుట్టూ ఉన్న ఐదు కూనలు దాని పిల్లలుగా అధికారులు గుర్తించారు. ఇవి అటవిలోని రోడ్డుపైకి రాగా.. వాటిని రెండు వైపుల నుంచి ఫోటోలు, వీడియోల కోసం చుట్టుముట్టారు.
విషయం సీరియస్ కావడంతో మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఘటన సమయంలో సఫారీ వాహనాల డ్రైవర్లను, గైడ్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనల్ని ఉల్లంఘించి అటవీ వాతావరణంలో జంతువులకు హానీ కలిగించేలా ప్రవర్తించడం, వాటిని భయాందోళనలకు గురి చేశారనే కారణంగా.. వారిపై అటవీ చట్టాల ప్రకారం.. ఒక్కొక్క డ్రైవర్ పై రూ.25 వేల రూపాయల జరిమానా విధించగా.. గైడ్స్ పై రూ. 1 రూపాయాల జరిమానా విధించారు. ఘటనతో సంబంధం ఉన్న వారిపై 1972 వైల్డ్ లైఫ్ ప్రొటేక్షన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Also Read : బిచ్చగాడితో లవ్.. ఆరుగురు పిల్లల తల్లి జంప్..
కాగా.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు.. ఈ సమయంలో జీపుల్లో ఉన్న టూరిస్టులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. వారు అటవీ చట్టాలను ఉల్లంఘించారని తెలిపిన అధికారులు.. వారందరిని శాశ్వతంగా సంరక్షణాలయం, సంబంధిత ఏరియాల్లోకి రాకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని బోర్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దాంతో పాటు.. టూరిస్ట్ గైడ్లు, డ్రైవర్లకు ఇతర సిబ్బందికి ఇలాంటి విషయాలపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు.. హైకోర్టు సీరియస్
మహారాష్ట్రలోని ఉమ్రేడ్-పౌని-కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో పిల్లలతో ఉన్న పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు
పర్యాటకులను చూసి భయాందోళన చెందిన పులి
ఈ వీడియో వైరల్ కావడంతో సీరియస్ అయిన మహారాష్ట్ర హైకోర్టు
ఈ ఘటనపై విచారణకు… pic.twitter.com/VP8Kd7mFWe
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025