Man Quits High Paying Job| డబ్బు, సమయం, కుటుంబం ఈ మూడింటిని సమపాళ్లలో అనుభవించిన వారే జీవితంలో నిజమైన విజయం సాధిస్తారు. విపరీతంగా డబ్బు సంపాదించడానికి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే మనిషికి మానసిక సమస్యలు తప్పవు. ఈ సత్యాన్ని గ్రహించిన ఒక యువకుడు సంవత్సరానికి రూ.54 లక్షలు సంపాదన ఉన్న తన ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఇంటి వద్ద నుంచే తనకు ఇష్టమైన బిజినెస్ ప్రారంభించాడు. పైగా తన పని ద్వారా ఇతరులకు సాయపడుతూ సంతోషంగా జీవిస్తున్నాడు.
కోల్ కతా నగరానికి చెందిన పరన్‌తాప్ చౌదరి సంవత్సరం క్రితం వరకు స్క్వేర్ యార్డ్స్ కంపెనీకీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉద్యోగం చేసేవాడు. అతని సాలరీ సంవత్సరానికి రూ.54 లక్షలు ఉండేది. ఏడేళ్ల పాటు బైజూస్, స్క్వేర్ యార్డ్స్ లాంటి కంపెనీల్లో ఉద్యోగం చేసిన తరువాత పరన్ తాప్ కు జీవితం పట్ల విరక్త పుట్టింది. ఉద్యోగ రీత్యా వారానికి 70 గంటలు పనిచేసేవాడు. తన కెరీర్లో పరన్ తాప్ 5000 మందిని సేల్స్ ట్రైనింగ్ ఇచ్చాడు. 250కి పైగా సేల్స్ టీమ్ లకు నేతృత్వం వహించాడు. అయితే ఇదంతా చేస్తూ.. తాను వ్యక్తిగత జీవితం కోల్పోయానని గ్రహించాడు.
అందుకే తాను కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకొని ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ఇంటి వద్ద ఉండి ఏ పనిచేయాలో అర్థమయ్యేది కాదు. ఈ కారణంగా తాను ఇంటి నుంచి ఏ పనిచేయగలను అని ఆలోచిస్తూ ఉండగా.. అతనికి ఒక ఐడియా వచ్చింది. అతనికి రైటర్ కావాలన్నది ఎప్పటి నుంచో కోరిక.. పైగా సేల్స్ రంగంలో అనుభవం ఉంది. ఈ రెండింటిని మేళవించి.. లింక్డ్ ఇన్ లో తన అనుభవాలు, తన నైపుణ్యం గురించి ప్రతిరోజు పోస్ట్ చేసేవాడు.
Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!
అలా ఆరు నెలల క్రితం.. పరన్ తాప్ ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు. ఇంతకుముందు కంపెనీలో సేల్స్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ ఎవరైనా తమ బిజినెస్ అభివృద్ధి చేయాలనుకునే వారికి వన్ ఆన్ వన్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. అందుకోసం గంటకు రూ.6000 ఫీజు తీసుకుంటాడు. వారిని కేవలం గైడ్ చేయడమే కాకుండా వారి పనితీరుని కూడా సమీక్షిస్తుంటాడు. కంపెనీలు మార్కెటింగ్ కంటెంట్ రైటింగ్ చేస్తున్నాడు. పైగా ఆన్ లైన్ తాను రన్ చేసే బిజినెస్ కు యాడ్స్ కూడా వద్దనుకున్నాడు. దీంతో అతని బిజినెస్ ప్రస్తుతం బాగానే రన్ అవుతోంది.
అయితే ప్రస్తుతం పరన్ తాప్ నెల ఆదాయం రూ.లక్షపైగా ఉంది. ఇది అతను ఇంతకుముందు సంపాదనతో పోలిస్తే చాలా తక్కువ. కానీ భవిష్యత్తులో తనకు ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. పైగా కంపెనీలో పనిచేసే సమయంలో తనపై విపరీతంగా ఒత్తిడి ఉండేదని.. ఇప్పుడు తనకు ఇష్టమైన సమయంలో పనిచేస్తున్నానని ఎటువంటి టార్గెట్లు, ఒత్తిడి లేకుండా సంతోషంగా జీవిస్తున్నానని చెప్పాడు.
తాను పాత ఉద్యోగం చేసి ఉంటే గత మూడు నెలల్లో తన సంపాదన కనీసం రూ.10 లక్షలు ఉండేదని.. కానీ అలా చేస్తే చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చేదని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మాత్రం తనకు ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉందని చెప్పాడు. పరన్ తాప్ చౌదరి లింక్డ్ ఇన్ అకౌంట్ పై మంచి ఇంప్రెషన్స్ కూడా వస్తున్నాయి.