BigTV English

Revanth Reddy: అసెంబ్లీ లోకి యువతరం.. 21 ఏళ్లకే ఎమ్మెల్యే? రేవంత్ సూచనపై దేశమంతా చర్చ!

Revanth Reddy: అసెంబ్లీ లోకి యువతరం.. 21 ఏళ్లకే ఎమ్మెల్యే? రేవంత్ సూచనపై దేశమంతా చర్చ!

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూజిలాండ్ పార్లమెంట్ వీడియోను మీరు చూసే ఉంటారు. ఒళ్లు పులకించేటట్లు తన తెగ ప్రాతినిధ్యాన్ని నిర్భయంగా ప్రభుత్వం ముందు ఉంచిన ఆ నాయకురాలి పేరు.. హనా-రౌహితీ మైపీ-క్లార్క్. ఆమె 22 ఏళ్లకే న్యూజిలాండ్‌ పార్లమెంట్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. న్యూజిలాండ్ బ్రిటీష్ క్రౌన్ కింద ఇంకెన్నాళ్లు ఉండాలంటూ ప్రభుత్వం ఆమోదించిన వివాదస్పద బిల్లును చించిపారేసి, తమ తెగ సాంప్రదాయ కళ ‘హాకా’తో నిరసన గళం విప్పిందామె. ఇలాంటి తెగింపు యువ రక్తంలో కాక ఇంకెక్కడ కనిపిస్తుంది. సరిగ్గా, ఇలాంటి ధైర్యమైన యువతే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఎంతో మంది పెద్దలు ఇప్పటికే చెప్పారు. నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా రారండి! అని శ్రీశ్రీ చెప్పిన భావానికి అర్థం ఈ యువతే. అందుకే, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం అవసరాన్ని తెలిపారు.


రాష్ట్ర శాసనసభల్లో యువత ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు వీలుగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న రేవంత్ రెడ్డీ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 21 ఏళ్లకే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు జిల్లాల్లో విజయవంతంగా పనిచేస్తున్నారని.. అదే వయసులో ఉన్న యువకులు ఎమ్మెల్యేలుగా కూడా ఎదగగలరన్న నమ్మకం ఉందని రేవంత్ వెల్లడించడంపై చర్చలు జరుగుతున్నాయి. “ఓటు వేయడానికి కనీస వయస్సు 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారనీ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వయస్సు 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు చేసి, యువత ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించేలా చట్టాన్ని సవరిస్తే, యువ తరం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించవచ్చని అన్న రేవంత్ మాటలు భారత రాజకీయాల్లో కొత్త ఒరవడికి మార్గాలు వేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి, విద్యార్థులంతా తమ తీర్మానాన్ని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి సైతం పంపించాలని రేవంత్ సూచించడం రాజకీయాల్లో యువత అవసరాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయనడానికి నిదర్శనంగా ఉన్నాయ్.

అయితే, అందరు రాజకీయ నేతల్లా సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పి ఊరుకోలేదు. తెలంగాణ పార్లమెంట్ సభ్యులు కూడా లోక్‌సభలో దీనిపై చర్చించేందుకు సూచనలు చేస్తామంటూ యువతకు భరోసా కూడా ఇచ్చారు. యువ ఎమ్మెల్యేలు చట్టసభల్లోకి రావడం వల్ల వారికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వాలను డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. క్రీడలు, విద్య, ఉపాధితో సహా ముఖ్యమైన యువత సమస్యలపై ప్రభుత్వం విధివిధానాలు మరింత పఠిష్టం కావడానికి యువత ప్రాతినిధ్యం అవసరాన్ని నొక్కి చెప్పారు. కనీస ఓటింగ్ వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని స్మరించుకుంటూ… భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న వైనాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.


నిజానికి, జాతీయ నాయకులతో పాటు గొప్ప గొప్పవారంతా యుక్త వయస్సులోనే సిద్ధాంతపరంగా వారి ఆలోచనలను రూపొందించుకున్నారు. ఉద్యమాలు చేశారు. అంతెందుకు, తెలంగాణ రావడంలో విద్యార్థులు, యువత పాత్ర ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా, ఈ యుగం యువతరానిదే అనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా మార్పు కోసం అనేక మంది యువతీ యువకులు ఉద్యమాల్లో పాల్గొనడం గతం కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. యువత చదువుతో పాటుగా… తమ డిమాండ్లు పరిష్కారించాలంటూ వీధుల్లోకి వస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్క్‌లు, కమ్యూనిటీలను కనెక్ట్ చేసుకుంటూ… వారి గళాన్ని వ్యక్తీకరిస్తున్నారు. టెక్నాలజీని మార్పు కోసం ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నారు. నిరంకుశ పాలనలు, అవినీతి, అసమానతలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి తీసుకురావాలనీ… తమతో పాటు రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పోరాడుతున్నారు. అందుకే, ఇలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని సీఎం రేవంత్ భావించడం వెనుక పెద్ద మార్పుకు సంకేతం ఉందని అనుకోవాలి.

అయితే, భారతదేశంలో యువతీ, యువకుల రాజకీయ ప్రాతినిధ్యం పరిమితంగానే ఉందనడంలో సందేహం లేదు. తెలంగాణలో జరిగిన చిల్డ్రన్స్ మాక్ అసెంబ్లీతో పాటు, కేంద్ర స్థాయిలో కూడా యూత్ పార్లమెంట్‌లు నిర్వహిస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాల్లో యువత తమ ఆలోచనలను స్పష్టంగా చెబుతున్నారు. నిర్ణయాత్మక ప్రక్రియల్లో మరింత అర్ధవంతంగా యువత భాగస్వామ్యం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. తమ జీవితాలు, భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మరింత స్పష్టతను కోరుకుంటున్నారు. యువత డిజిటల్ ప్రపంచానికి బానిసలై సమాజం గురించి పట్టించుకోరనే వాదనకు విరుద్ధంగా నేటి యువత డిజిటల్ వేదికలో క్రియాశీల పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. సామాజిక బాధ్యతగా సోషల్ మీడియాలో నిరసనలు చేయడం… వారి కమ్యూనిటీలను మెరుగుపరచడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం… సామాజిక పురోగతి కోసం కొత్త ఆవిష్కరణలు చేయడం వంటి చర్యలు వారిలో నిబద్ధతను తెలియజేస్తున్నాయి.

అధికారిక రాజకీయాల్లో యువత భాగస్వామ్యం, ప్రభావం పరిమితంగా కనిపిస్తుంది. అందుకే, అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో కూడా యువత ఓటింగ్ శాతం క్షీణిస్తోందనే నివేదికలు కూడా ఉన్నాయి. అందులోనూ, భారతదేశంలో యువ జనాభాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ, రాజకీయ నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో యువకులు తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ పార్టీలలో వారి ప్రమేయం కూడా తగ్గిపోతోంది. భారతదేశ చట్ట సభల్లో గమనిస్తే ఇప్పుడిప్పుడే యువతరం రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. తెలంగాణలో 26 ఏళ్లకే మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలిచారు. అలాగే, పాలకుర్తిలో యశస్వినీ రెడ్డి కూడా 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఇక, దేశ వ్యాప్తంగా చూసుకుంటే, 25 ఏళ్లకే పార్లమెంట్ సభ్యులుగా, ఆయా రాష్ట్రాల్లో శాసనసభలకు పోటీచేసి గెలిచిన యువతీయువకులు ఉన్నారు. వీళ్లలో దాదాపు అందరూ రాజకీయ కుటుంబ నేపథ్యం నుండే వచ్చినప్పటికీ, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం చాలా బలంగా, యువత ఆలోచనలకు తగినట్లు ఉంటుందనడంలో సందేహం లేదు.

యువత రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే! అయితే, దీని అమలుకు మాత్రం ఏ రాజకీయ పార్టీ అనుకున్నంత ప్రోత్సాహాన్ని ఇవ్వట్లేదన్నది కనిపిస్తున్న నిజం. ఇప్పుడు, సీఎం రేవంత్ దీనికి భిన్నంగా అడుగు వేశారు. యువతను ప్రోత్సహించడమే కాదు, 21 సంవత్సరాల తన ప్రతిపాదనను పార్లమెంట్‌‌లో కూడా ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. బ్రిటన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన కొన్నిదేశాల్లో ఇలాంటి సిస్టమే ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో మెరుగైన మార్పును తీసుకొస్తుంది. అయితే, మన దగ్గర మారాల్సింది ఏంటన్నదే ఇప్పుడున్న ప్రశ్న?

పుడుతూనే ఎవ్వరూ లీడర్లు కాలేరు! అందుకే, విద్యార్థి వయసు నుండే క్లాస్‌లో లీడర్లుగా, కాలేజీల్లో విద్యార్థి సంఘాలు నడిపే వారిగా యువత తమ ప్రతిభను చూపిస్తారు. ఆ అనుభవమే వారిని భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం పోరాడే విధంగా మలుస్తుంది. అలాగే, యువత పాలించడం కూడా నేర్చుకుంటారు. సమాజాన్ని అర్థం చేసుకునే తెలివితేటలు ఉంటే చాలు, ఆ వ్యక్తిని నాయకుడిగా మలచవచ్చంటారు మేథావులు. నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణాల్లో తాను చేస్తున్న పని మీద పూర్తి అవగాహన, ఆ పని చెయ్యటానికి కావలిసిన పూర్తి సమాచారం, నైపుణ్యం ఉంటే చాలు. ఇక ఇవన్నీ వృత్తి సంబంధిత జ్ఞానం ఉన్నపుడే వస్తాయి. అందుకే, యుక్త వయసులో నాయకత్వ బాధ్యతలు తీసుకున్నప్పుడు సమాజంలో కూడా సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు కూడా దీన్నే పాటిస్తున్నాయి.

అమెరికాలో చూసుకుంటే, 18 ఏళ్లకే రాష్ట్ర ప్రతినిధులుగా మారుతున్న యువత ఉన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌‌‌ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‌లో 18 ఏళ్ల వయసున్న వ్యక్తి ఉన్నారంటే నమ్మగలమా… లిలియన్ హేల్ అనే యువతి వాషింగ్టన్ స్టేట్‌లో 19వ జిల్లాకు ప్రతినిధిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. అలా అమెరికాలో వెస్ట్ వర్జీనియా, న్యూహాంప్‌షైర్, ఓహియో వంటి చాలా రాష్ట్రాల్లో పాతికేళ్ల కంటే తక్కువ వయసున్న యువత చట్టసభల్లో కీలకంగా వ్యవహరించిన చరిత్ర ఉంది. ఆ మాటకొస్తే అమెరికాలో 16వ శతాబ్ధంలోనే యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం పొందారు. 1970‌ల నుండి అమెరికా యువత మరింత ఎక్కువగా చట్టసభలకు వెళ్లారు. వీళ్లలో 20 ఏళ్ల కంటే తక్కువున్నవారు చాలా మందే ఉన్నారు. దీన్ని బట్టి, భారతదేశంలో 21 ఏళ్ల వయసును రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రతిపాదించడం నూటికి నూరు శాతం సమర్థించాల్సిన అంశమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. …స్పాట్…

ఇక, బ్రిటన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే చూడొచ్చు. ఆ దేశంలో పార్లమెంట్ మెంబర్‌గా ఎన్నికల్లో నిలబడటానికి వయోపరిమితి 18 ఏళ్లు. 2024లో జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన అత్యంత చిన్న వయసున్న పార్లమెంట్ సభ్యుడు 22 ఏళ్ల శామ్ కార్లింగ్. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ నుండి ఎన్నికయ్యారు. ఇక, న్యూజిలాండ్‌లో 22 ఏళ్లకే పార్లమెంట్ మెంబర్‌గా వెళ్లి, తన కమ్యూనిటీ కోసం గొంతెత్తిన హనా-రౌహితీ మైపీ-క్లార్క్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన యంగెస్ట్ ఎంపీ. ఇలా అభివృద్ది చెందిన దేశాల్లో చాలా చోట్ల 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువత రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. వారి వయసును కాదు, వారి ఉద్దేశాలను చూడాలంటూ కోరుతున్నారు. ఇలాంటి మార్పే భారతదేశ రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. దేశానికి అనుభవజ్ఞులైన నాయకులు ఉండటం ఎంత అవసరమో… వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆలోచించే ముందు చూపు ఉన్న యువత కూడా అంతే అవసరం.

అయితే, యువత భాగస్వామ్యానికి మొదటి అవరోధం భారతదేశంలో ఎన్నికలకు కనీస ఓటింగ్ వయస్సు 25 సంవత్సరాలుగా ఉండటం. అయితే, దేశానికి, రాష్ట్రానికి ఎవరు నాయకులుగా ఉండాలన్నది తమ ఓటు హక్కుతో 18 ఏళ్లకే నిర్ణయించుకోగలినప్పుడు 21 ఏళ్లకు పరిపాలన ఎలా ఉండాలో తెలుసుకోలేరా? అన్నది ఆలోచించాల్సిన అంశం. అయితే, వయసును పెంచడం మాత్రమే యువతకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం కాదు. మితిమీరిన డబ్బుతో నడుస్తున్న రాజకీయాల్లో సమూలమైన మార్పుల కోసం మరిన్ని నిర్మాణాత్మక నిర్ణయాలు కూడా అవసరమే. ముఖ్యంగా, అలిఖిత రాజకీయ ఆర్థిక నిబంధనలు. అంటే, ఇంత ఖర్చు పడితే తప్ప ప్రధాన పార్టీ నుండీ సీటు ఖాయం కాదు అనే పరిస్థితి. ఒకవేళ, రిజర్వేషన్ల బట్టో… పాపులారిటీ మేరకో సీటు ఇచ్చినా అది ఆర్థికంగా, రాజకీయంగా బలమైన అభ్యర్థిపై పోటీకి నిలబట్టే వాతారణం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది. దాదాపు అన్ని చోట్లా… రాజకీయాలనేవి తలపండిన నేతలు, అందులోనూ ఎక్కువగా పురుషులు, సంపన్న కుటుంబాలకే పరిమితమయ్యాయి. దీని వల్ల, తెలివైన, మంచి నిర్ణయాలు తీసుకోగలిగిన యువతకు రాజకీయ వేదిక దూరం అవుతుంది. వీళ్లను రాజకీయ చర్చలు, నిర్ణయాధికారాల నుండి క్రమపద్ధతిలో మినహాయించే సంస్కృతి ఉంది. ఈ పరిస్థితి యువత తక్కువ ప్రాతినిధ్యం వహించడానికి కారణం అవుతుంది.

Also Read: ఆ గ్రామానికి ఏమైంది? నెలన్నర వ్యవధిలో 20 మరణాలు? కారణం అదేనంటున్న గ్రామస్థులు..

రాజకీయల్లో యువత రావాలనీ, వారి అవసరం ఉందనీ నేతలంతా ఏకాభిప్రాయాన్ని తెలిపినా… చాలా చోట్ల, యువత రాజకీయాల్లో పాల్గొనడాన్ని సున్నితమైన సమస్యగా చూస్తారు. మంచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి స్థానిక స్థాయిలో పౌరులందరి భాగస్వామ్యం అవసరమని చెబుతూనే యువతకు నిర్ణయాత్మక ప్రక్రియల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వరు. ఇంకా అనుభవం కావాలి అనే పేరుతో పక్కన పెడతారు. ఇక, యువకులతో పోలిస్తే యువతులకు అసలు ఛాన్సే ఉండదు. నూటికీ కోటీకి అందులోనూ తండ్రి తాతల వారసత్వంతో మాత్రమే తప్పనిసరై, అవకాశం దొరకుతుంది. నిజానికి, భావవ్యక్తీకరణ, ఉద్యమ స్వేచ్ఛను నిరోధించే కొన్ని అప్రజాస్వామిక చట్టాలు కూడా యువతను రాజకీయాలకు దూరం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. శాంతియుతంగా రాజకీయ చర్చలు, నిరసనలు చేసే యువతను కూడా ప్రభుత్వానికి అడ్డం అయితే కేసులు పెట్టి ఇరికించడం వంటి సంఘటనలు దేశంలో కొత్తేమీ కాదు. చట్టప్రకారం, 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి శాసన సభ్యులుగా నిలబడకూడదనే నియామనికి అనుగుణంగా యాక్టీవ్‌గా ఉండే యువతను టార్గెట్ చేసిన ఉదాహరణలు కూడా లేకపోలేదు. అందుకే, యువత రాజకీయాల్లోకి రావడానికి చట్టబద్ధమైన వాతావరణం అవసరం ఉంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×