Divorce Celebration: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక తండ్రి తన కుమార్తె విడాకులను వేడుకగా జరుపుకున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సాధారణంగా విడాకులు అంటే సమాజంలో ఒక చిన్నచూపు లేదా బాధాకరమైన విషయంగా భావిస్తారు. కానీ, ఈ తండ్రి మాత్రం తన కుమార్తె నరకం లాంటి కాపురానికి స్వస్తి చెప్పి తిరిగి రావడాన్ని ఒక ‘కొత్త ఆరంభం’గా భావించి డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు.
మీరట్‌లోని శాస్త్రీ నగర్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర కుమార్ శర్మ కుమార్తె ప్రణీత శర్మ. 2018లో ఆర్మీ మేజర్ గౌరవ్ అగ్నిహోత్రితో వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితంలో ఆమె తీవ్రమైన మానసిక, శారీరక వేధింపులకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు ఏప్రిల్ 4, 2026న మీరట్ ఫ్యామిలీ కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది. సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రణీత, ప్రస్తుతం ఒక జ్యుడిషియల్ అకాడమీలో ఫైనాన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
కోర్టు నుండి విడాకుల తీర్పు రాగానే, జ్ఞానేంద్ర కుమార్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి కోర్టు ప్రాంగణం నుండి ఇంటి వరకు డప్పులతో ఊరేగింపు నిర్వహించారు. కుటుంబ సభ్యులందరూ “I Love My Daughter” అని రాసి ఉన్న నలుపు రంగు టీషర్టులను ధరించి తమ మద్దతును చాటారు. ఆ టీషర్టులపై ప్రణీత ఫోటో కూడా ఉంది. ఇంటికి చేరుకున్నాక మిఠాయిలు పంచి, పూలమాలలతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఇది విడాకుల వేడుకలా కాకుండా, ఒక కుమార్తె స్వేచ్ఛను పొందిన పండుగలా సాగింది.
“నా కుమార్తె పెళ్లి తర్వాత సంతోషంగా లేనప్పుడు.. ఆమెను మళ్ళీ సంతోషపెట్టడం తండ్రిగా నా బాధ్యత. ఆమె గౌరవంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ స్వాగతం పలికాను. మేము ఎటువంటి భరణం లేదా ఆస్తులను ఆశించలేదు.. కేవలం నా బిడ్డ క్షేమంగా తిరిగి వస్తే చాలని కోరుకున్నాను.” అని జ్ఞానేంద్ర కుమార్ శర్మ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ తండ్రిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రతి అమ్మాయికి ఇలాంటి తండ్రి ఉంటే గృహహింసకు తావుండదని ఒక యూజర్ కామెంట్ చేశారు.
मेरठ में एक रिटायर्ड जज पिता ने तलाक के बाद अपनी बेटी का ढोल-नगाड़ों के साथ स्वागत किया।
बेटी को तलाक के बाद परिवार के लोग ढोल की थाप पर नाचते-गाते नजर आए। मिठाइयाँ बांटकर खुशी जाहिर की। बेटी के स्वागत में फूल-मालाएं पहनाई गईं। पूरा उत्सव जैसा माहौल बनाया।
वहीं इस दौरान परिवार… pic.twitter.com/Q4ITGXuLOm
— Indiapost News (@IPNews_24) April 5, 2026