ప్రకృతిలో జంతువుల మధ్య ఉండే రిలేషన్ షిప్, సమయస్ఫూర్తి కొన్నిసార్లు మనుషులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంటోంది. వాటికి ఏ ఆపద తలెత్తని ఒక్కసారిగా గుంపుగా మారి సాయం చేసుకుంటాయి. తాజాగా ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో అచ్చం అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఒక కోతి ప్రాణాలను కాపాడటం కోసం వానర సైన్యం మొత్తం ప్రాణాలకు తెగించి మొసలితో తలపడిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరుదైన పోరాటం ‘ఐక్యమత్యమే మహాబలం’ అనే మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
కేంద్రపారా జిల్లాలోని ఒక నది తీరంలో కోతుల గుంపు ఆహారం కోసం లేదా నీటి దప్పిక కోసం తిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. నదిలో మాటు వేసిన ఒక మొసలి.. ఒడ్డుకు దగ్గరగా ఉన్న ఒక కోతిని లక్ష్యంగా చేసుకుని తినేందుకు సిద్ధమైంది. మెరుపు వేగంతో నీటిలో నుంచి బయటకు వచ్చి.. ఆ కోతిని పట్టుకుని నదిలోకి లాగడానికి ప్రయత్నించింది. ఆ కరడుగట్టిన మొసలికి చిక్కిన కోతి తప్పించుకోలేక ప్రాణభయంతో అల్లాడిపోయింది. సాధారణంగా మొసలి పట్టుకుంటే ఏ జంతువైనా ప్రాణాలు కోల్పోవాల్సిందేనని అందరూ భావిస్తారు.
ప్రాణాలకు తెగించిన వానర సైన్యం
అయితే, తన తోటి జీవి ప్రమాదంలో ఉండటాన్ని గమనించిన మిగిలిన కోతులు భయంతో పారిపోలేదు. ఏమాత్రం తడుముకోకుండా, ఏకతాటిపైకి వచ్చి మొసలిపైకి విరుచుకుపడ్డాయి. సాధారణంగా కోతులు మొసళ్లకు దూరంగా ఉంటాయని మనకు తెలుసు, కానీ ఇక్కడ తమ సహచరుడిని రక్షించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. వానర సైన్యం మొత్తం ఒక్కసారిగా నదిలోకి దూకి మొసలి చుట్టూ అలజడి సృష్టించాయి. ఆ మొసలిని గందరగోళానికి గురిచేస్తూ, దానిపై భౌతికంగా దాడికి దిగాయి.
This video from Kendrapara, Odisha shows something incredible:
a group of monkeys leaping into the river to save one of their own from a crocodile’s attack.The courage and unity they showed is unbelievable. Sometimes, animals stand by each other more than humans do. pic.twitter.com/FJESQjBZ2S
— Manas Muduli (@manas_muduli) December 28, 2025
మొసలి వెనకడుగు.. వానర విజయం
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా కోతుల గుంపు మొత్తం తనను చుట్టుముట్టడంతో ఆ మొసలి ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇంతటి ఊహించని ఘటనను చూసిన మొసలి, చేసేదేమీ లేక తన పట్టును వదిలివేసింది. మొసలి పట్టు సడలగానే.. గాయపడిన కోతిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో వానర సైన్యం విజయం సాధించింది. అనంతరం కోతులన్నీ సురక్షితంగా నది అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. ఈ సాహసోపేతమైన పోరాటం అక్కడ ఉన్నవారిని మరియు వీడియో చూసిన నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. ‘జంతువుల నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన కీలక అంశం ఇది.. నిజమైన స్నేహం అంటే ఇదే’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వన్యప్రాణి నిపుణులు సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. కోతుల్లో సామాజిక బంధాలు చాలా బలంగా ఉంటాయని, అయితే మొసలి వంటి క్రూర మృగాన్ని ఎదుర్కోవడం అనేది వాటి అత్యున్నత తెలివితేటలకు, ఐక్యతకు నిదర్శనమని చెబుతున్నారు.
ALSO READ: Hindupur Crime: అయ్యో పాపం.. ఎంత పనిచేశావ్ దేవుడా..? తల్లి చనిపోయిన క్షణాల్లోనే పసి పాప కూడా..!