ATM Rs.500 Notes| వాట్సాప్‌లో ఇటీవల ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతోంది. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2025 సెప్టెంబర్ నాటికి ఏటీఎంల నుండి 500 రూపాయల నోట్ల పంపిణీని నిలిపివేయనుందని.. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆదేశించిందని సమాచారం అని ఆ మెసేజ్ బాగా సర్కులేట్ అవుతోంది. ఈ మెసేజ్ చదివిన ప్రజలలో గందరగోళానికి గురవుతున్నారు. దీంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిజ నిరూపణ కోసం విచారణ చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వార్తను తప్పుడు సమాచారంగా పేర్కొంది. ఈ తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి అధికారులు స్పష్టీకరణ ఇచ్చారు.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఏమి చెప్పింది?
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తమ సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్‌లో స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. “ఆర్‌బీఐ నోట్ల నిలుపుదల గురించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు,” అని పీఐబీ స్పష్టం చేసింది. అంతేకాక, 500 రూపాయల నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగా కొనసాగుతాయని, ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరారు. ఇలాంటి సమాచారాన్ని నమ్మే ముందు లేదా షేర్ చేసే ముందు అధికారిక ఛానెల్స్ ద్వారా వాస్తవాలను చెక్ చేయాలని పీఐబీ సూచించింది.
తప్పుడు సమాచారం ప్రమాదకరం
వాట్సాప్ గ్రూపుల ద్వారా వేగంగా వ్యాప్తి చెందిన ఈ తప్పుడు మెసేజ్.. ఆర్‌బీఐ 500 రూపాయల నోట్లను ఏటీఎంల నుండి ఉపసంహరించుకోమని ఆదేశించిందని సూచించింది. ఇలాంటి పుకార్లు ప్రజలలో భయాందోళనలను సృష్టించి, బ్యాంకింగ్ వ్యవస్థను అస్థిరపరిచే ప్రమాదం ఉంది. ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఇలాంటి ఆదేశాలకు సంబంధించిన ఎలాంటి ప్రకటన లేదు. ఇది డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందే సమస్యను హైలైట్ చేస్తుంది.
అధికారిక మూలాల నుండి సమాచారం చెక్ చేయండి
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రజలను అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ల వంటి విశ్వసనీయ మూలాల ద్వారా సమాచారాన్ని తనిఖీ చేయమని కోరింది. అనుమానాస్పద మెసేజ్ లు సర్కులేట్ అవుతుంటే ఫిర్యాదు చేయాలని, తద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి సహాయపడాలని కూడా రిజర్వ్ బ్యాంక్ సూచించింది. గతంలో కూడా కరెన్సీ నోట్ల గురించి ఇలాంటి పుకార్లు వచ్చాయి. ఉదాహరణకు డీమోనిటైజేషన్ లేదా చట్టబద్ధ కరెన్సీ స్టేటస్‌ని మార్చడం వంటి మెసేజ్‌లు. ఆర్‌బీఐ ఎల్లప్పుడూ అధికారిక మార్గాల ద్వారా మాత్రమే విధాన మార్పులను ప్రకటిస్తుందని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంలో నిరంతరం అప్రమత్తం ఉండాలని సూచించింది.
Also Read: అమెరికాలో మాంసాహారం తినే ఈగల బెడద.. చనిపోతున్న పశువులు..
రూ.500 నోటు చెల్లుబాటు
ప్రస్తుతం, 500 రూపాయల నోట్లు భారత కరెన్సీ వ్యవస్థలో చెల్లుబాటులో ఉన్నాయి. ఈ తప్పుడు మెసేజ్‌ని పట్టించుకోవద్దని ప్రజలను ఆర్బిఐని కోరింది. అధికారులు డిజిటల్ అవగాహనను పెంపొందించడం ద్వారా తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలు విశ్వసనీయ మూలాల నుండి సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని, ధృవీకరించని మెసేజ్‌లు షేర్ చేయవద్దని అధికారులు సూచించారు.