Delhi: ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హస్తినకు సిద్ధమయ్యారా? ఇద్దరూ ఒకే వేదికను పంచుకోనున్నారా? బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ ఉంటుందా? దీనిపై తెలుగు రాష్ట్రాల్లో నేతలు, ప్రజలు చర్చించుకోవడం మొదలైంది. ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోనున్న కార్యక్రమం ఏంటి? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. తమ తమ రాష్ట్రాల నుంచి బయలుదేరుతున్నారు. ఇద్దరు సీఎంలు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అంతేకాదు ఇద్దరు కలిసి ఒకే వేదిక పంచుకోబోతున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 15న ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ టూర్‌లో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఏపీలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్రం గ్రాంట్లకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో చర్చించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు.
అయితే సాయంత్రం లేకుంటే మరుసటి రోజు ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యులు, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతో భేటీ కానున్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రితో చర్చించనున్నారు. అటు ఆర్థికమంత్రి సీతారామన్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌కు హాజరవుతారు.
ALSO READ: కవిత కేసు వ్యవహారం.. కేసీఆర్‌తో కేటీఆర్-హరీష్‌రావు భేటీ
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన రెండురోజులపాటు హస్తినలో ఉండనున్నారు. పార్టీ పెద్దలను సీఎం కలవనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రప్రభుత్వ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. మెట్రో ప్రాజెక్టు, బీసీ రిజర్వేషన్లు, కేంద్ర జలశక్తి మంత్రి, నిధుల కోసం ఆర్థికమంత్రిని కలవనున్నట్లు సమాచారం.
15న ఢిల్లీలో జరగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభకు ముఖ్యమంత్రులు ఇద్దరు హాజరుకానున్నారు. ఒకే వేదికను పంచుకునే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో ఇరువురు మధ్య బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చ జరిగే అవకాశముందని అంటున్నారు. దీనిపై సీఎంలు పరిష్కారం దిశగా ప్రతిపాదనలు చేసే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకే వేదికపై ఇరు రాష్ట్రాల సీఎంలు రావడం ఇది మూడోసారి. గతంలో హైదరాబాద్ వేదికగా సీఎం రేవంత్‌తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ తర్వాత దావోస్ వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్టులో కాసేపు మాట్లాడుకున్నారు. ఢిల్లీ వేదికగా మూడోసారి కలవనున్నట్లు చెబుతున్నారు.