Viral Post: ఈ రోజుల్లో డబ్బు సంపాదన చాలా తేలిక అని కొందరు అంటే.. మరికొందరు మాత్రం చాలా కష్టమని చెబుతుంటారు. అయితే మంచి జీతం ఉంటే.. ఎలాంటి ఖర్చులనైనా భరించేస్తూ.. హ్యాపీ లైఫ్ ను గడిపేయవచ్చని చాలా మంది నమ్మకం. కానీ ఓ వ్యక్తి ఈ అభిప్రాయాలను పూర్తిగా తలకిందులు చేసేశారు. తనకు రూ.80,000 వరకూ జీతం వస్తున్నప్పటికీ ఏమాత్రం సరిపోవడం లేదని.. నెట్టింట వాపోయారు. ప్రస్తుతం అతడి పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చను లేవనెత్తింది.
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడ్డిట్ లో సదరు వ్యక్తి చేసిన పోస్ట్.. తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకప్పుడు రూ.80,000 అంటే భారీ జీతంగా అనిపించేదని.. కానీ ఇప్పుడు అది ప్రాథమిక అవసరాలకే సరిపోతోందని సదరు వ్యక్తి వాపోయారు. ప్రతి నెలా తన ఖాతాలోకి డబ్బు వచ్చిన వెంటనే అది మాయమైపోతున్నట్లు అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. దీనివల్ల భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి లేదా ప్రణాళిక వేసుకోవడానికి తనకు చాలా తక్కువ అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు.
పెద్ద మెుత్తంలో జీతం వస్తున్నప్పటికీ జీవితంపై ఏమాత్రం సంతృప్తి కలగడం లేదని అతడు రెడ్డిట్ లో రాసుకొచ్చారు. కేవలం బతుకున్నానే తప్పు.. లైఫ్ లో ఎదగడం లేదన్న ఫీలింగ్ కొన్నిసార్లు కలుగుతోందని రాసుకొచ్చారు. ఇంటి అద్దె, కిరాణా సామాగ్రి, బిల్లులు, ఈఎంఐలు ఇలా అత్యవసర ఖర్చుల వల్ల.. జీవితంలో ఆర్థికంగా ముందుకు వెళ్లలేకపోతున్నానని సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు.
Also Read: Supreme Court: తప్పుడు ఫిర్యాదులు.. ఫోర్జరీ సాక్ష్యాలపై.. సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
మరోవైపు ఉద్యోగి పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘తప్పు నీది కాదు, ధరలు పెరిగాయి కానీ జీతాలు పెరగలేదు’ అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘మనం సంపాదించే కొద్దీ మన ఖర్చులను పెంచుకుంటాం. అందుకే డబ్బు మిగలదు’ అని ఇంకొకరు విశ్లేషించారు. అయితే రూ.80,000 అనేది ప్రస్తుతం బతకడానికి మాత్రమే సరిపోయే అమౌంట్ అని ఒక నెటిజన్ పేర్కొన్నారు. అయితే మరికొందరు అసలు ఉద్యోగమే లేని నిరుద్యోగులు చాలా మంది సమాజంలో ఉన్నారని.. మరి వారి పరిస్థితి ఏంటో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.