Silver petrol pump: ఒకవైపు మనసునిండా భక్తి, మరోవైపు దృఢనమ్మకంతో నెరవేరిన మొక్కు. ఇది కేవలం ఒక చారిత్రక ఘట్టం కాదు, తరతరాలుగా నిబద్ధతను నమ్మిన మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లాలో ఉన్న శ్రీ సంవాలియా సేథ్ ఆలయం మరోసారి దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం? ఏకంగా 10 కిలోల వెండితో తయారు చేసిన పెట్రోల్ బంక్‌ను విరాళంగా అందించిన మంగీలాల్ జరోలి అనే వ్యాపారి!
చిత్తోడ్‌గఢ్ జిల్లా డంగ్లా ప్రాంతానికి చెందిన మంగీలాల్ జరోలి తన కుమారులు కుశాల్ కుమార్, సుశీల్ కుమార్ లకు పెట్రోల్ బంక్ స్థాపించడానికి అనుమతి రావాలని 67 ఏళ్ల క్రితమే మొక్కారు. అప్పట్లో అనుమతి వస్తే నిన్ను వెండి పెట్రోల్ బంక్‌తో కృతజ్ఞత చెప్పుతానని ఆలయానికి వాగ్దానం చేశారు. సంవత్సరాల తరబడి ప్రయత్నించినప్పటికీ అనుమతి దక్కలేదు. కానీ భక్తి మాత్రం మారలేదు. ఇప్పటికి 67 ఏళ్ల తర్వాత వారి అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ రావడంతో, మంగీలాల్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి పెట్రోల్ బంక్‌ను మంగీలాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. కారుపై తీసుకువచ్చిన ఈ కానుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. పంచభక్ష్య పరిమళాలు, ఘంటలు, నాదాలు, హారతుల మధ్య జరిగిన ఈ కార్యక్రమం వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీ సంవాలియా సేథ్ ఆలయం భక్తుల మనసుల్లో ఒక విశ్వాస చిహ్నంగా నిలిచింది. ఈ ఆలయంలో పూజించే విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నా, భక్తులు ఆయనను వ్యాపార భాగస్వామిగా భావిస్తూ, ఆదాయంలో భాగాన్ని ఆలయానికి విరాళంగా ఇస్తుంటారు. ఒక్క నెల ఆదాయంలోనే రూ.29 కోట్ల విలువైన నాణేలు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ లాంటి విరాళాలు వచ్చాయంటే ఈ ఆలయంపై ఉన్న విశ్వాసం అర్థం చేసుకోవచ్చు.
Also Read: Vetapalem beach: బీచ్ అంటే గోవా అనుకుంటే పొరపాటే.. వేటపాలెం వీరంగం చూశారా!
ఇంతకు ముందు కూడా ఈ ఆలయానికి వెండి హెలికాప్టర్‌లు, ఇళ్ళ నమూనాలు, క్రికెట్ స్టంప్‌లు వంటి ఆశ్చర్యకర విరాళాలు భక్తులు సమర్పించారు. ఈ కొత్తగా వచ్చిన వెండి పెట్రోల్ బంక్ మాత్రం వాటన్నిటికంటే ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే, ఇది కేవలం ఒక కానుక కాదు, అది నాలుగు తరాల ఆశ, ఓర్పు, భక్తి కలబోసిన చిహ్నం.
మంగీలాల్ జరోలి కుటుంబం చేసిన ఈ విరాళానికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రత కూడా మరింత కఠినంగా ఉంచారు. ఇటీవలే రూ.30 లక్షల విలువైన CCTV కెమెరాలు ఆలయంలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు, ఏ ఒక్క విరాళం పట్లనూ అపహాస్యం జరగకుండా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు.
ఈ ఘటన మనకు చెప్పే విషయం చాలా స్పష్టంగా ఉంది. భక్తి సమయం చూసి పుట్టదు, మొక్కులు మరిచిపోవు, మనసు చంచలంగా ఉన్నా నమ్మకం నిలబడితే దేవుడే దారి చూపిస్తాడు. మంగీలాల్ చేసిన ఈ విరాళం భౌతికంగా ఎంత ఖరీదైనదైనా, దాని వెనుక దాగిన ఆధ్యాత్మిక విలువ మరింత గొప్పది.
మనం మన మనసులో చేసిన వాగ్దానాలు, మొక్కులు, వాటిని నెరవేర్చే క్షణాలు ఎంత పవిత్రంగా ఉంటాయో.. వెండి మెరుపు కన్నా, ఈ భక్తి మెరుపు నేటి సమాజానికి దారి చూపించాల్సిన వెలుగని భక్తులు అంటున్నారు.