ప్రస్తుత దలైలామాకు 90 ఏళ్ళ వయసు వచ్చేసింది. టిబెటన్ బౌద్ధమత గురువును దలైలామా అని పిలుచుకుంటారు. ప్రస్తుత దలైలామాగా టెన్జిన్ గ్యాట్సో అలియాస్ లామో తోండాప్ ఉన్నారు. ఇప్పుడు ఆయన తన తదుపరి దలైలామాను ఎంపిక చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ విషయంలోనే చైనా దలైలామాతో వాదిస్తోంది.
కొత్త దలైలామా ఎంపిక కావాలంటే అతడిని చైనా కూడా ఒప్పుకోవాలని చెబుతోంది. కానీ ప్రస్తుత దలైలామా మాత్రం తన స్థానంలో కొత్త దలైలామాను ఎంపిక చేసుకుని అధికారం తనకే ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు దలైలామా అంటే ఏమిటి? ఆ పదవికి ఎందుకంత ప్రాముఖ్యత తెలుసుకోండి.
దలై లామా అంటే ఏమిటి?
దలైలామా అనేది ఒక బిరుదు. దీనికి ఎన్నో ఎంతో లోతైన మూలం ఉంది. చైనా టిబిటాలజీ పరిశోధనా కేంద్రం చెబుతున్న ప్రకారం ఈ పదం నిజానికి టిబెట్ కు చెందినది కాదు. మంగోలియన్లకు చెందినది. మంగోలియాలో దలై అంటే సముద్రం అని అర్థం. ఇక లామా అంటే టిబెట్ భాషలో ఆధ్యాత్మిక గురువు అని అర్థం. ఈ బిరుదులు మొదటిసారిగా 1578లో ఉపయోగించారు. మంగోల్ నాయకుడైన అల్తాన్ ఖాన్ ఒక బౌద్ధమత గురువుకు ఇచ్చిన బిరుదు ఇది. 1587లో మింగ్ చక్రవర్తి ఈ బిరుదును అధికారికంగా గుర్తించాడు. అప్పటినుంచి దలైలామాలు ఉండడం అధికారికంగా మొదలైంది.
ప్రస్తుత దలైలామా ఎవరు?
ప్రస్తుతం దలైలామాగా ఉన్న వ్యక్తి టెన్జిన్ గ్యాట్సో. ఆయన టిబెట్లోని ఒక చిన్న గ్రామంలో 1935లో జన్మించారు. ఈయన 14వ దలైలామా. 1950లో 15 సంవత్సరాల వయసులో ఆయన అధికారికంగా దలైలామా పదవిని చేపట్టారు. చైనా ప్రభుత్వంతో వచ్చిన వివాదాల కారణంగా భారతదేశానికి 1959లో వలస వచ్చారు. అప్పటినుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలోనే నివాసం ఉంటున్నారు.
ప్రస్తుత దలైలామా బ్రహ్మచారి, సన్యాసి. అతడిని అవలోకితేశ్వర మానవ రూపంగా బౌద్ధులు నమ్ముతారు. అందుకే దలైలామా అనే పదవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు 90 ఏళ్ల వయసు రావడంతో 14వ దలైలామా తానే 15వ దలైలామాను ఎంపిక చేసి ప్రకటిస్తానని చెప్పారు. దానికి చైనా అభ్యంతరం చెబుతోంది. చైనా కూడా దలైలామాను ఎంపిక చేస్తుందని తమకే అధికారం ఉందని అక్కడ ప్రభుత్వం వారిస్తోంది. ఇదే కొనసాగితే చైనా ఒక దలైలామాను, ప్రస్తుత దలైలామా మరొక వ్యక్తిని ఎంపిక చేయవచ్చు. ఇద్దరు దలైలామాలు ఉంటే పరిస్థితి గందరగోళంగా మారిపోతుంది.
దలైలామా టిబెట్లోని అతి పెద్ద బౌద్ధ శాఖ అయినా గెలుక్ శాఖకు చెందినవారు. ఈ శాఖ టిబెట్ లోనే అధికంగా ప్రాచుర్యం పొందింది. 1989లో ఈ దలైలామా టిబెట్లో శాంతియుత మార్గాల ద్వారా పోరాటం చేసిన వ్యక్తిగా నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దలైలామాకు ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడిగా మంచి ప్రాముఖ్యత ఉంటుంది.