ఇండియా అంటే.. అనేక మతాలు, జాతుల సమాహారం. భిన్నత్వంలో ఏకత్వం కేవలం మన భారత దేశానికే సాధ్యం. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నట్లే.. ఎన్నో భాషలు, యాసలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చాలా ఈజీగా నేర్చేసుకోగలం. కానీ, కొన్ని భాషలను నేర్చుకోవాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. అలాంటి కష్టమైన భాషల్లో దక్షిణాది భాషలు ఎప్పుడూ ముందు ఉంటాయి.
ఈ దేశంలో ఏదైనా సులభమైన భాష ఉందంటే.. అది హిందీ భాష అనే చెప్పుకోవాలి. మన దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆ భాషను చాలా సులభంగా నేర్చేసుకోగలరు. కానీ, ఉత్తరాది ప్రజలు మాత్రం మన భాషను నేర్చుకోలేక తంటాలు పడుతుంటారు. ఇండియాలో అధికారికంగా సుమారు 22 లాంగ్వేజులు ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృతం ప్రాచీన కాలం నుంచి చెలామణిలో ఉన్న భాషలు. వీటి లిపి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. హిందీ కాస్త భిన్నంగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా పాఠశాలల్లో హిందీని సెకండ్ లాంగ్వేజ్‌గా నేర్పిస్తున్నారు. దానివల్ల దక్షిణాది ప్రజలకు ఆ భాషపై పూర్తిగా అవగాహణ ఉంటుంది. ఆ ఒక్క భాష వస్తే చాలు.. బెంగాలీ, ఒడియా, మరాఠి భాషలను కూడా సులభంగా నేర్చేసుకోవచ్చు. అయితే.. దక్షిణాదిలో అలా కాదు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం.. దేని దారి దానిదే. యాశ, పలికే విధానం చాలా భిన్నంగా ఉంటుంది.
మన దేశంలో తెలుగు, మలయాళం భాషల లిపి చాలా క్లిష్టంగా ఉంటుంది. వీటికి అనేక అక్షరాలు, అచ్చులు, హల్లులు ఇలా చాలానే ఉంటాయి. అలాగే సంస్కృతానికి దేవనగరి లిపిని ఉపయోగిస్తారు. ఇక పంజాబీ భాషకు గురుముఖి లిపిని ఉపయోగిస్తారు. ఈ లిపి చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే వారు మాట్లాడే విధానంగా కూడా భిన్నంగానే ఉంటుంది. ఈ భాషలను మాట్లాడటం మాట ఎలా ఉన్నా.. రాత మాత్రం కష్టం. ఇందుకు ఎంతో సాధన, భాషపై పట్టు అవసరం.
1. మలయాళం: దక్షిణ భారతంలో కేరళ ప్రజలు మాట్లాడే భాష ఇది. దీని కష్టమైన లిపి, గ్రామర్ వల్ల మలయాళం భాషను అత్యంత క్లిష్టమైనదిగా పేర్కొంటున్నారు. ఈ భాషకు 56 అక్షరాలు ఉంటాయి. ఇది రాయడమే కాదు పలకడం కూడా కష్టమే. మాట్లాడేప్పుడు కూడా స్వరంలో ఆ పదానికి తగిన మార్పులు చేస్తుండాలి. సరైన ఉచ్ఛరణ లేకపోతే పదాల అర్థం మారిపోవచ్చు. భాష రాయడం, మాట్లాడటం నేర్చుకోడానికి సుమారు రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టవచ్చు.
2. సంస్కృతం: మన భారతీయ భాషలకు తల్లిలాంటిది సంస్కృతం. అయితే, ఈ భాషను నేర్చుకోవడం అంత సులభం కాదు. ఈ భాష మన సాంస్కృతిలో భాగమైనప్పటికీ.. వారసత్వంగా చేరలేదు. ముఖ్యంగా దేవనగరి లిపిని నేర్చుకోవడం చాలా కష్టం. దీన్ని నేర్చుకోవడానికి రెండు నుంచి నాలుగేళ్లు పట్టవచ్చు. శాస్త్రీయ గ్రంథాలపై చదివి, పూర్తిగా పట్టు సాధించేందుకు సుమారు ఆరు నుంచి ఎనిమిదేళ్ల సమయం పట్టవచ్చు.
3. కన్నడ: కర్ణాటక ప్రజల మాతృ భాష కన్నడ. మన తెలుగు తరహాలోనే ఈ భాషకు అనేక మాండలికాలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి మారిపోతూ భాష మారిపోతూ ఉంటుంది. అందుకే ఈ భాషను నేర్చుకోవడాన్ని కష్టంగా భావిస్తారు. ఈ భాష లిపిని నేర్చుకోవడం తెలుగువారికి సులభమే. కానీ, భాషను పలకడం, అర్థం చేసుకోవడమే కష్టం. అక్కడి ప్రాంతీయ మాండలికాలను అర్థం చేసుకుంటే.. భాషను సులభంగా అర్థం చేసుకోవచ్చు. నేర్చుకోవచ్చు. ఈ భాష నేర్చుకోవడానికి తెలుగువారికి కనీసం ఏడాది పట్టవచ్చు. ఇతరులకు రెండు నుండి మూడేళ్లు పట్టవచ్చు. మాంలికాలతో పూర్తిగా పట్టు సాధించాలంటే సుమారు నాలుగేళ్లు పట్టవచ్చు.
4. తమిళం: ఇది తమిళనాడు ప్రజల మాతృ భాష. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాషల్లో ఒకటి. ఈ భాషకు గొప్ప సాహిత్య సంప్రదాయం ఉంది. అందుకే తమిళలు తమ భాష ఉనికిని కాపాడుకోడానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఈ భాషను నేర్చుకోవడం అంత ఈజీ కాదు. తెలుగువారు వారి సినిమాలు చూస్తారు కాబట్టి.. సీన్ల బట్టి భాషను అర్థం చేసేసుకుంటారు. కానీ, కొత్తగా ఆ భాష మాట్లాడటం, రాయడం నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. తమిళ లిపిని తెలుగువారు నేర్చుకోవడం సులభమే. తమిళంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే.. ఏడాది నుంచి రెండేళ్లు పట్టవచ్చు.
5. తెలుగు: ఏపీ, తెలంగాణ ప్రజల మాతృ భాష తెలుగు. ఈ భాష ఎందుకు కష్టమైనది అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, పరాయి భాషస్తులకు ఇది క్లిష్టమే. మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే.. తెలుగు మాటలు సంగీత స్వరాలను తలపిస్తాయి. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం అలాంటిది మరి. అయితే, తెలుగు లిపిని అంత సులభంగా అర్థం కాదు ఇతరులకు. కన్నడ, తమిళం తరహాలోనే చాలా కష్టమైనది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో మాండలికాలు, యాసలు అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. మన భాషను పూర్తిస్థాయిలో నేర్చుకోడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పట్టవచ్చట.
6. ఒడియా: ఇది ఒడిస్సా ప్రజల మాతృ భాష. ఇది బెంగాలీ భాషను పోలీ ఉంటుంది. బెంగాలీ వచ్చినవారికి ఒడియా అర్థమవుతుంది. దీన్ని పూర్తిగా నేర్చుకోడానికి 1 నుంచి రెండేళ్లు పట్టవచ్చు.
7. బెంగాలి: పశ్చిమ బెంగాల్ ప్రజల మాతృ భాష బెంగాలి, బంగ్లాదేశీయులు కూడా ఈ భాష మాట్లాడతారు. ఈ భాషను పలకడం కాస్త కష్టమే. అయితే, దక్షిణాది భాషలంత కష్టం కాదు. దీన్ని నేర్చుకోడానికి ఒకటి నుంచి రెండేళ్లు పట్టవచ్చు.
8. హిందీ: ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇది. దీన్ని పలకడం సులభమే. కానీ, రాయడం మాత్రం కష్టం. ఇది దక్షిణాది భాషలకు చాలా భిన్నంగా ఉంటుంది. దీని మీ పూర్తిగా పట్టు సాధించేందుకు ఏడాది నుంచి రెండేళ్లు పట్టవచ్చు.
9. మరాఠి: మహారాష్ట్ర ప్రజల మాతృ భాష మరాఠి. ఇది కూడా హిందీ లాంటిదే. కానీ, పలికే విధానం తేడాగా ఉంటుంది. దీన్ని పూర్తిగా నేర్చుకోవడానికి ఏడాది నుంచి రెండేళ్లు పట్టవచ్చు. హిందీ తెలిసినవారికి ఇది ఈజీ.
10. పంజాబి: ఇది హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మాతృ భాష. దీని పలకడమే కాదు, రాయడం కూడా కష్టమే. హిందీ తెలిసినవారికి ఇది కాస్త త్వరగానే అర్థమవుతుంది. అలాగే నేర్చుకోవడం కూడా సులభమే. ఈ భాష నేర్చుకోడానికి ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టవచ్చు.
Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్.. శంషాబాద్ విమానాశ్రయం కంటే పెద్దదా? తేడా ఏమిటీ?