Chef Vishnu Manohar: చెఫ్ విష్ణు మనోహర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ఆయన.. పాకశాస్త్రంలో మెలకువలతో ఇప్పటికే పలు అంతర్జాతీయ రికార్డులను నెలకొల్పారు. దీపావళి పర్వదినం రోజు మరో అరుదైన రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. 24 గంటల్లో ఏకంగా 10 వేల దోసెలు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకవేళ ఆయన 10 వేల దోసెలు వేయగలిగితే ఆయన 26వ రికార్డును నెలకొల్పినట్లు అవుతుంది. ఇప్పటికే ఆయన పేరు మీద ఏకంగా 25 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం విష్ణు మనోహర్ 10 వేల దోసెల వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దోసెలు వేయడంలో అందెవేసిన చెయ్యి కావడంతో ఈ రికార్డు కూడా ఆయన ఖాతాలోకి వచ్చేస్తుందని కొందరు అంటుంటే, ఇది సాధ్యం అయ్యే పని కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది ఆయనకు సపోర్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. భారతీయ చెఫ్ అరుదైన రికార్డును అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
విష్ణు మనోహర్ ఖాతాలో బోలెడు రికార్డులు
చెఫ్ విష్ణు మనోహర్ ఖాతాలో ఇప్పటికే బోలెడు రికార్డులు ఉన్నాయి. అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన సందర్భంగా ఆయన ఏకంగా 7 టన్నుల రామ్ హల్వాను తయారు చేశారు. అయోధ్య వేదికగా ఈ అరుదైన రికార్డును నెలకొల్పారు. అదే సమయంలో మూడు గంటల్లో ఏకంగా 2 వేల దోసెలు వేసి భక్తులకు అందించారు. 52 గంటల పాటు ఏకబిగిన ఎక్కువ సేపు వంట చేసిన చెఫ్ గా వరల్డ్ రికార్డు సాధించారు. యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. లండన్ కు చెందిన 60 మంది పరిశీలకుల బృందం సమక్షంలో ఆయన 52 గంటల పాటు 750 రకాల వంటలు చేశారు. ఒకవేళ మనోహర్ 10 వేల దోసెలు వేస్తే ఒకేసారి రెండు రికార్డులు ఆయన ఖాతాలో పడుతాయి. 24 గంటల పాటు ఆపకుండా దోసెలు తయారు చేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు 24 గంటల్లో అత్యంత ఎక్కువ దోసెలు వేసి వ్యక్తిగా మరో రికార్డు క్రియేట్ చేస్తారు.
రికార్డులు సృష్టించడం నా లక్ష్యం కాదు
తాను ఎప్పుడూ రికార్డుల కోసం పని చేయలేదని, చేసే పని వల్లే రికార్డులు వస్తున్నాయన్నారు. “నేను ఏ రోజు రికార్డుల కోసం పని చేయలేదు. పాకులాడలేదు. నేను చేసే పని కారణంగానే రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. మా నాన్న అన్నదానం గొప్పదని చెప్పేవారు. ఆయన చెప్పిన మాట ప్రకారమే నేను ఈ పనులు చేస్తున్నాను. దీపావళి రోజున 10 వేల దోసెలు వేయాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ నేను 24 గంటల్లో 10 వేల దోసెలు వేస్తే నా ఖాతాలో 26వ రికార్డు వచ్చి చేరుతుంది. నేను గంటలకు 750 నుంచి 800 దోసెలు వస్తాను. సగటును 10 వేలు వేయగలుగుతాను. ఈ కార్యక్రమం కోసం మూడు క్వింటాళ్ల దోసె పిండి తయారు చేస్తున్నాం. శనగపప్పు, మినపప్పుతో దోసెలు వేయబోతున్నాను. టన్ను చట్నీని తయారు చేయబోతున్నాం” అని విష్ణు మనోహర్ చెప్పుకొచ్చారు.
Read Also: మలంతో మనీ.. ఈ కొరియన్ ప్రొఫెసర్ ఐడియాకు హ్యాట్సాఫ్.. ఇక టాయిలెట్‌లోనే ఎనర్జీ పుట్టింవచ్చు!