సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న ఈ పెంగ్విన్‌ను చూస్తుంటే.. ‘‘జేబులో చేతులు పెట్టుకుని.. ఎక్కడికో వెళ్లిపోతున్నా…’’ అంటూ అప్పట్లో దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్ తప్పకుండా గుర్తుకువస్తుంది. అలాగే.. మరో దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పిన పెంగ్విన్ లవ్ స్టోరీ కూడా కళ్ల ముందు కదులుతుంది. అసలు ఏంటీ ఈ పెంగ్విన్ కథ? అది ఎందుకు అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిపోతుంది? ఎక్కడి వెళ్తోంది? ఇది ఎందుకు అంత వైరల్ అవుతోంది?
పెంగ్విన్లు భలే క్యూట్‌గా ఉంటాయి. ఎవరికీ హాని చెయ్యవు. వాటి నడక కూడా చాలా భలే గమ్మత్తుగా ఉంటుంది. వాటిని చూసేకొద్ది చూడాలని అనిపిస్తుంది. మరి అంత ఫన్నీగా కనిపించే పెంగ్విన్లు.. చాలా ఎమోషనల్ అనే సంగతి మీకు తెలుసా? ఔనండి.. అవి కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఇస్తాయి. ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా సిన్సియర్‌గా ఉంటాయి. ద్రోహం.. మోసం.. ద్వేషాలను సంహించలేవు. ఈ పెంగ్విన్లు ఎక్కువగా గుంపుగా ఉండేందుకే ఇష్టపడతాయి. ఒంటరిగా ఉండలేవు. ఒక వేళ ఏదైనా పెంగ్విన్ ఒంటరిగా కనిపించింది అంటే.. దాని వెనుక ఎంతో విషాదం దాగి ఉందని అర్థం. అంతేకాదు.. అదే ఆ పెంగ్విన్‌కు అంతిమ ఘడియలు కూడా.
రీల్స్‌లో ఎక్కడ చూసినా.. పెంగ్విన్ వీడియోలే కనిపిస్తున్నాయి. దీని గురించి ఒక్కొక్కరు ఒక్క కథ చెబుతున్నారు. వాస్తవానికి ఆ పెంగ్విన్ వీడియో ఇప్పటిది కాదు. 2007లో ఓ జర్మనీ ఫిల్మ్‌మేకర్ వెర్నెర్ హర్జేగ్ ఈ వీడియోను రికార్డు చేశాడు. వారు ఆ డాక్యుమెంటరీ రికార్డు చేస్తున్నప్పుడు ఒక పెంగ్విన్ చాలా వింతగా కనిపించింది. అది తమ గుంపుతో కాకుండా ఒంటరిగా ఏటో నడుచుకుంటూ వెళ్లిపోతుంది. దీంతో వారు ఆ పెంగ్విన్ దారి తప్పిందేమో అని భావించి.. రెండు మూడుసార్లు దాన్ని తీసుకొచ్చి గుంపులో పెట్టారు. కానీ, అది మళ్లీ అటే వెళ్లిపోతుంది. అయితే, దీని గురించి ఎందుకంత ఆందోళన చెందడం అని మీకు అనిపించవచ్చు. అయితే, పెంగ్విన్లు ఎక్కువగా సముద్ర తీరాల్లోనే బతుకుతాయి. అక్కడే వాటికి ఆహారం దొరుకుతుంది. కాబట్టి.. అవి ఆ ప్రాంతాన్ని, తమ సమూహాన్ని వదిలిపెట్టవు. అయితే, ఈ వీడియోలో ఉన్న పెంగ్విన్ మాత్రం పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్లిపోతుంది. మధ్యలో కాసేపు నిలబడి వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవరూ తనని పట్టించుకోవడం లేదని తెలిసి.. మళ్లీ అది ఒంటరి నడక కొనసాగిస్తుంది. ఇది ఒక రకంగా సూసైడ్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. మరి, దానికి అంత కష్టం ఏం వచ్చింది?
ఒత్తిళ్లు.. డిప్రెషన్లు.. కేవలం మనుషులకే కాదు. జంతువులకు కూడా ఉంటాయి. పెంగ్వినులు కూడా ఒక్కోసారి తమ గుంపులో ఇమడలేక ఇబ్బంది పడుతుంటాయి. ఒత్తడికి గురవ్వుతాయి. క్రమేనా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాయి. వాటికంటూ ఒక లక్ష్యం ఉండదు.. తీవ్ర అలసట, భావోద్వేగానికి గురవ్వుతాయి. చివరికి ప్రాణాలు విడిచిపెట్టేందకు సిద్ధమవుతాయి. ఇప్పుడు ఈ పెంగ్విన్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్లిపోతూ.. కెమేరాకు చిక్కింది. పర్వతాలపై వాటికి ఎలాంటి ఆహారం దొరకదు. దీంతో ఆకలితో అలమటించి చనిపోతాయి. అందుకే, ఆ పెంగ్విన్ కథ తెలిసినవారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అది తెలియనివారు.. ఫన్నీ మీమ్స్‌తో ఆనందం పొందుతున్నారు.
ఈ పెంగ్విన్ల లైఫ్ గురించి ఒకప్పుడు పూరి జగన్నాథ్.. తన పాడ్‌కాస్టులో చెప్పారు. పెంగ్విన్లు ప్రేమకు చాలా విలువ నిస్తాయని తెలిపారు. గుండ్రని రాళ్లను కానుకగా ఇవ్వడం ద్వారా అవి తమ ప్రేమను వ్యక్తం చేస్తాయని, అంగీకారం తర్వాత అవి కలిసే జీవిస్తాయని పేర్కొన్నారు. అయితే, వాటిలో ఏ ఒక్కటి మోసం చేసినా అవి తట్టుకోలేవని, ఆహారం దొరకని ప్రాంతానికి వెళ్లిపోయి చనిపోతాయని తెలిపారు. ప్రస్తుతం ఈ పెంగ్విన్ వీడియో ‘నిహిలిస్ట్ పెంగ్విన్’ మీమ్‌తో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. అయితే, అది ఎందుకు ఎక్కడికి వెళ్తోంది అనేది మాత్రం ఇంకా మిస్టరీనే.
Also Read: ఈ పక్షి ఉమ్ము ఖరీదు రూ.10 లక్షలకు పైనే.. లొట్టలేసుకుని మరీ తింటున్నారు!
https://www.instagram.com/reels/DQTli0ACSq-/