Metro: మెట్రో రైళ్లలో ప్రయాణించేటప్పుడు కొన్ని రకాల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. మెట్రో ట్రాక్‌పై నుంచి దూకడం, మెట్రో ట్రైన్‌లో మహిళల కోచ్‌లోని సీట్లలో మగవారు కూర్చోవడం, ట్రైన్ చివరి స్టేషన్‌కు వెళ్లినా దగకుండా తిరిగి అదే ట్రైన్‌లో ప్రయాణం చేయడం వంటివి చేస్తే మెట్రో సిబ్బంది ఫైన్ విధిస్తారు. అంతేకాకుండా గంటల తరబడి ట్రైన్‌లో ఉన్నా కూడా ఇలాంటి ఫైన్‌లు పడే ఛాన్స్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇవేమి చేయకున్నా ఓ మహిళకు బెంగళూరు మెట్రో ఫైన్ విధించింది. ట్రైన్‌లో కూర్చొని ఉండగా ఆమె చేసిన ఓ పనే దీనికి కారణం. అసలు ఆమె ఏం చేసిందో తెలుసా..
మదవర స్టేషన్ నుంచి మగడి రోడ్‌కు శనివారం మెట్రో రైలులో ప్రయాణించిన ఓ మహిళకు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ (బీఎంఆర్‌సీఎల్) ఫైన్ విధించింది. ఆమెను చూసిన ఓ సహప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో మెట్రో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అతడు పేర్కొన్నాడు.
ఈ విషయం గమనించిన మెట్రో అధికారులు ఆదివారం ఉదయం ఆమెను మదవర స్టేషన్‌లో గుర్తించారు. భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకుని రూ. 500 జరిమానా విధించారు. అయితే తన టిఫిన్‌లో ఉన్న ఆహారం తింటూ కనిపించినందుకే తనకు ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ జరిమానా విధించడానికి కారణం గురించి ఒక అధికారి మాట్లాడారు. మెట్రో రైలులో ఆహారం తినడం నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలను అరికట్టేందుకు మరింత కఠిన నిబంధనలు తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. మెట్రో అనేది అందరూ వాడే స్థలమని ఆయన తెలిపారు. అందరి సౌకర్యం, భద్రత కోసం ప్రయాణికులు నిబంధనలు పాటించాలని అన్నారు.
ఇదిలా ఉండగా, గత వారం బెంగళూరు మెట్రో కొత్త భద్రతా చర్యలను ప్రకటించింది. రైళ్లలో, స్టేషన్‌లలో చిరగొట్టే పొగాకు వాడటం, చెత్త వేయడం వంటి సమస్యలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఫైన్ వేస్తామని, చర్యలు కూడా తీసుకుంటామని మెట్రో అధికారులు తెలిపారు.
మెటల్ డిటెక్టర్లు ఇలాంటి వస్తువులను గుర్తించలేవు కాబట్టి, అన్ని స్టేషన్‌లలో శారీరక తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు, తనిఖీలు చేసేందుకు భద్రతా సిబ్బందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు.