75th constitution day celebrations: నేడు దేశవ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. 1950 నవంబర్ 26వ తేదీ నుండి రాజ్యాంగం అమలులోకి రాగా నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏపీలోనూ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఐదో భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఆయనతో పాటూ పలువురు, మంత్రులు సైతం వేడుకల్లో పాల్గొంటారు.
వేడుకలకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. అన్ని జిల్లాల్లో వేడుకలు నిర్వహించాలని సూచించారు. వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. కార్యక్రమంలో అందరితో రాజ్యాంగ పీఠికను చదివించాలని సీఎస్ సూచించారు. జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో వేడుకలను నిర్వహించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేడుకలు నిర్వహించాలని కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచించారు.