Big Stories

ACB Raids: ఏపీలో ఏసీబీ సంచలన రైడ్స్.. ఇదేనా కారణం? ఆయనేనా డైరెక్షన్?

ACB Raids: ఒక్క ఫోన్‌కాల్. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దడ పుట్టించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏకకాలంలో జరుగుతున్న ఏసీబీ సోదారు సంచలనం రేపాయి. ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జిల్లాల్లో దాడులు చేశారు. అటు బెజవాడ వ్యవహారం మొత్తం రిజిస్ట్రేషన్ శాఖలోనే తీవ్ర కలకలం రేపింది.

- Advertisement -

విజయవాడ.. గుంటూరు.. తిరుపతి.. అనంతపురం.. కడప.. ఉత్తరాంధ్ర.. ఆ ప్రాంతం.. ఈ జిల్లా అని లేదు.. ఏపీ వ్యాప్తంగా ఏసీబీ ఆకస్మిక సోదాలు చేపట్టింది. పలు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసులు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో వారం రోజులుగా రెయిడ్స్ జరిగాయి. తిరుపతి, అనంతపురం, బద్వేల్, తుని, నర్సాపురం, కందుకూరు, మేడికొండూరు, గుంటూరు, జలమూరు ఎమ్మార్వో ఆఫీసుల్లో, శ్రీకాకుళంలో మెరుపు దాడులు నిర్వహించారు. 14400 నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు చేపట్టారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రికార్డులను పరిశీలించారు. కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

వివాదాల సబ్‌ రిజిస్ట్రార్ రాఘవరావు కహానీ సంచలనం. పటమటలో నియామకం నుంచి వివాదాలే. నెలరోజుల్లోనే ప్రభుత్వం బదిలీ చేయగా.. హైకోర్టుకు వెళ్ళి పోస్టింగ్ తెచ్చుకున్నాయన. అప్పటికే అక్కడున్న రిజిస్ట్రార్ పక్కనే చైర్ వేసుకుని విధుల్లో పాల్గొన్నారు. ఇప్పుడాయన ఆఫీసులో మంగళవారం సాయంత్రం నుంచి దాడులు కొనసాగాయి. రాఘవరావు కొద్దిరోజులు గాంధీనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేయడంతో అక్కడా తనిఖీలు జరిగాయి. మంగళగిరిలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

నంద్యాల మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో ఆకస్మిక దాడులు జరిగాయి. నివాస గృహాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, వాణిజ్య భవంతుల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో, కొన్నింటిని క్రమబద్ధీకరించడంలో అవినీతి జరుగుతోందనే ఫోన్ కాల్‌ ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించారు. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలోకి వెళ్లి తలుపులు మూసి రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందిని విచారించారు.

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ వాసా నగేశ్‌ నివాసాల్లో ఏసీబీ రెయిడ్స్ తీవ్ర సంచలనం రేపాయి. గతంలో ద్వారకా తిరుమల దేవస్థానం సూపరింటెండెంట్‌గా చేసిన సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆయన బెజవాడ భవానీపురంలో లోటస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆ ఇంట్లో, ఆలయంలోని ఏవో కార్యాలయంలో, ద్వారకా తిరుమల, నిడదవోలు, భీమడోలు ప్రాంతాల్లోని ఆయన ఇళ్లు, బంధువుల నివాసాల్లో బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేశాయి. కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఏక కాలంలో రెయిడ్స్ చేయడం వెనుక కొందరు అధికారుల పాత్ర ఉందని సమాచారం. కొన్ని ఆఫీసుల్లో అక్రమాలు అన్నీ ఇన్నీ కాదని గుర్తించారు. దొంగ రిజిస్ట్రేషన్లు చేయించడం, డబ్బులు డిమాండ్ చేయడం, స్టాంప్‌లను పక్కదారి పట్టించడం, డాక్యుమెంట్ రైటర్స్‌తో అక్రమంగా వసూళ్లు చేయించడం.. ఇలా అడుగుడుగునా అవినీతి బట్టబయలైంది. సబ్ రిజిస్ట్రార్ల పాత్రతో పాటు బయటి వ్యక్తుల ప్రమేయాన్నీ ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏసీబీ ఎప్పటినుంచో ఉన్నా.. ఒక్కసారిగా ఇంతలా యాక్టివేట్ అవడం వెనుక కారణమేంటి? ఈ పాయింట్ కూడా ఇంట్రెస్టింగే. ఏసీబీ పనితీరుపై సీఎం జగన్ ఇటీవల తీవ్ర అసంతప్తి వ్యక్తంచేసారు. అసలీ డిపార్ట్‌మెంట్ ఉందా.. పనిచేస్తోందా.. అనేంతలా అసహనం వ్యక్తంచేశారు. టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చినా ఆశించినస్థాయిలో పనితీరు లేదని హెచ్చరించారు. దీంతో ఏసీబీ డీజీ అలర్టయ్యారు. తన టీమ్‌లను ఉరికించారు. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా దాడులు. మరి, సీఎం శాటిస్ఫై అవగానే ఆపేస్తారా.. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తారా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News