Bhadradri Kothagudem Crime: కోటి ఆశలతో పుట్టింటి నుంచి అత్తింటికి అడుగుపెట్టింది నవ వధువు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త శాడిజం బయటపడింది. భార్య మూడు నెలల గర్భవతి అన్న కనికరం లేకుండా పోయింది. భార్య ఎటు వెళ్లకుండా అడుగడుగునా నిఘా పెట్టాడు. ఆమె సెల్‌ఫోన్ సైతం లాక్కున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లోనే నవ వధువు బందీగా మారింది. ఈ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.
పెళ్లయిన ఆరు నెలలకే ఘోరం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లచ్చగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు- రమాదేవి దంపతుల కూతురు అంజలి. సొంత గ్రామానికి చెందిన సాయికుమార్ హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. మే 14న అంజలి-సాయికుమార్ వివాహం ఘనంగా జరిగింది.
పెళ్లి సమయంలో అల్లుడికి ఇవ్వాల్సిన లాంఛనాలన్నీ అత్తింటివారు ఇచ్చారు. తన గ్రామంలో తల్లిదండ్రుల వద్ద భార్యని ఉంచాడు. వీలు చిక్కినప్పుడల్లా వచ్చి చూసి వెళ్లేవాడు. ఉన్నట్లుండి అల్లుడు సాయికుమార్ మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలీదు. అదనపు కట్నం కావాలని అంజలిని అత్తింటివారు (భర్తతో కలిసి) ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.
ఇంట్లో లోపల కూడా నిఘా, ఆపై కెమెరాలు
అంజలి-సాయికుమార్ దంపతుల గొడవ ఊరి పెద్దల వరకు వెళ్లింది. పెద్దల వార్నింగ్‌తో కాస్త తగ్గినట్టు నటించాడు సాయికుమార్. తల్లిదండ్రులతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండకూడదని భావించి తొలుత అంజలి సెల్‌ఫోన్‌ను లాక్కున్నాడు. ఇంకా అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.
కూతవేటు దూరంగా ఉన్న తల్లిదండ్రుల వద్దకు భార్యని వెళ్లకుండా కట్టడి చేశాడు. ఆమె మూడు నెలల గర్బవతి కూడా. సెల్‌ఫోన్‌లో పేరెంట్స్‌తో మాట్లాడనీయకుండా వేధించడంతో భరించలేకపోయింది. ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని పురుగుల మందు తాగింది.. వెంటనే అత్తమామలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఖమ్ముంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం మృతి చెందింది.
ALSO READ: పల్టీలు కొట్టిన కారు.. స్పాట్‌లో యువకులంతా మృతి
కూతురు మరణ వార్త తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. వైద్యం కోసం తరలించేటప్పుడు తమకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. అంజలి తల్లిదండ్రులు ఫిర్యాదుతో భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అంజలి మృతి విషయం తెలియగానే భర్త, అత్తమామలు ఇల్లెందు స్టేషన్‌కు వెళ్లారు. మరి పోలీసుల విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.