Thulabharam Scam in TTD: తిరుమలలో మరో స్కామ్ జరిగిందా..? తులాభారం డబ్బు మాయమైందా..? ఫలహారంలా పంచేసుకున్నారా? ఇప్పటికే.. కల్తీ నెయ్యి వ్యవహారంతో తిరుమల ప్రతిష్టకు మచ్చ వచ్చింది. ఇప్పుడు తులాభారంలోనూ స్కామ్ జరిగిందన్న వార్త… శ్రీవారి భక్తులను కలవరపెడుతోంది. అసలు టీటీడీలో ఏం జరిగింది? స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలను కూడా మింగేశారా? సూత్రధారులు ఎవరు..? పాత్రధారులు ఎవరు..?
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం
తిరుమల.. కలియుగదైవం వేంకటేశ్వరుడు కొలువైన పవిత్ర క్షేత్రం. ఏడుకొండలపై వెలిసిన ఆ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలమంది వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా స్వామివారిని కొలుస్తుంటారు. దేవదేవుడని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమలకు వచ్చే భక్తులు తీర్చుకునే మొక్కుల్లో ఒకటి తులాభారం. కోరిన కోర్కెలు తీరితే.. వడ్డికాసులవాడికి నిలువెత్తు నగదును… తులాభారంగా సమర్పిస్తుంటారు.
తులాభారం అంటే… త్రాసులో ఒకవైపు భక్తుడు కూర్చుంటారు. మరోవైపు… ఆ భక్తుడి బరువుకు సరిపడా నగదును… రెండు లేదా ఐదు రూపాయ నాణేలతో తూకం వేస్తారు. భక్తుడు ఎంత బరువుంటే.. అంత సొమ్ము నగదు రూపంలో అక్కడి సిబ్బంది ఇస్తారు. కొంత మంది… చక్కెర, బెల్లం, డ్రైఫ్రూట్స్‌తో కూడా తులాభారం ఇస్తారు.
తిరుమలలో మరో భారీ స్కామ్..?
స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు సమర్పించుకునే ఈ తులాభారంలోనూ భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీలోని కొంతమంది సాయంతో.. గత వైసీపీ నేతలు.. స్వామివారి సొమ్మును స్వాహా చేశారన్న విమర్శలు వస్తున్నాయి. తులాభారంలో స్కామ్ జరిగిందని స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత, టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డి. ఆయన ఆరోపిస్తున్నట్టు నిజంగానే స్కామ్ జరిగిందా..? వైసీపీ నేతలు దేవుడి సొమ్మునే కాజేశారా..?
టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డి ఆరోపణ
తిరుమలలో వేంకటేశ్వర స్వామి హుండీకే కాదు.. భక్తులు అందించే కానుకలకు కూడా భద్రత లేకుండా చేశారని భానుప్రకాష్‌రెడ్డి ఆరోపణ. తులాభారం దగ్గర ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని.. వారి సాయంతో సొమ్ములు కాజేశారని అనుమానం. వైసీపీ హయాంలో టీటీడీలో పనిచేసిన అధికారులు, అప్పటి పాలకమండలి బాధ్యత ఉందని అంటున్నారాయన. రోజుకు 10 లక్షల రూపాయల వరకు కొట్టేశారని అనుమానంగా ఉందన్నారు. ఆ సొమ్ము ఎవరికి చేరింది..? పాత్రధారులు, సూత్రధారులు ఎవరేనేది త్వరలోనే తేలుస్తామన్నారు.
Also Read: కంగారుపడుతున్న జగన్.. అడ్వకేట్లతో వరుసగా భేటీలు, ఎందుకు?
దేవుడి సొమ్మును జేబులో వేసుకుంది ఎవరు..?
2019-2024 మధ్య టీటీడీ ఖజానాకు రక్షణ లేకుండా చేశారని.. శ్రీవారి సొమ్మును వాటాలుగా పంచుకున్నారని ఆరోపిస్తున్నారు భానుప్రకాష్‌రెడ్డి. అసలు స్వామివారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయా అనే అనుమానం కూడా కలుగుతోందన్నారు. పరకామణి, తులభారం, శ్రీవారి డాలర్లు ఇలా ఏది వదలకుండా దోచేశారని చెప్తున్నారు. ఈ విషయంలో విచారణ జరిపేందుకు డీజీపీని, సీఎం చంద్రబాబును కలుస్తామన్నారు. కొందరు టీటీడీ ఉద్యోగులు తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తారని.. ఇంటి దొంగల భరతం పడతామని చెప్తున్నారు. 2019-24 వరకు జరిగిన ఆర్థిక అంశాలపై విచారణ జరిపించాలని బోర్డు మీటింగ్‌లో మాట్లాడుతానని అన్నారు భాను ప్రకాష్ రెడ్డి.
దోచుకుందంతా రికవరీ చేస్తామన్న భానుప్రకాష్
తిరుమలలో శ్రీవారి మూలవిరాట్టుకి శుక్రవారం అలంకరించే శేషవస్త్రానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రికి మాత్రమే శేషవస్త్రంతో ఆశీర్వచనం అందించే నిబంధన ఉంది. వైసీపీ హయాంలో ఆ శేషవస్త్రం సమర్పించడంలోనూ దుర్వినియోగం జరిగిందన్నారు. తిరుమల ఆలయంలో జరిగిన అవినీతి, అక్రమాల్లో పాత్రధారులు, సూత్రధారుల సమగ్ర వివరాలను బయటపెడతానని అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. వారందరూ త్వరలో జైలుకు వెళ్లడం తప్పదని హెచ్చరించారు భానుప్రకాష్‌రెడ్డి.