Bangalore City: అన్ని పన్నులు కట్టించుకుని సదుపాయాలు ఇవ్వక పోతే ఎలా? అదే భావించాడు బెంగుళూరుకి చెందిన ఓ వ్యక్తి. దీనివల్ల ఆయన ఆరోగ్య పరంగా ఇబ్బందులు తెచ్చుకున్నాడు. ఫలితంగా తనకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ బెంగుళూరు మహా నగర పాలిక సంస్థకు నోటీసులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
బెంగళూరు సిటీలో రోడ్లు దారుణంగా ఉన్నాయని ఆరోపించాడు 43 ఏళ్ల దివ్య కిరణ్. సిటీలోని రిచ్ మండ్ ప్రాంతానికి చెందిన ఆయన, బృహత్ బెంగళూరు మహానగర పాలికె- BBMPకి రూ.50 లక్షల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపాడు. ఆ నోటీసుల చూసి అధికారులు షాకయ్యారు.
ప్రతీ ఏటా క్రమం తప్పకుండా నగరపాలిక సంస్థకు పన్నులు చెల్లిస్తున్నానని, మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీబీఎంపీ విఫలమైందని ఆరోపించాడు. వీటి వల్ల తాను నరకం అనుభవిస్తున్నానని నోటీసులో ప్రస్తావించాడు. గుంతలుగా మారిన రోడ్లపై ప్రయాణించడం వల్ల మెడ,నడుము నొప్పులతో బాధపడుతున్నానని తెలిపాడు.
దాదాపు ఐదుసార్లు ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించానని, అత్యవసర చికిత్స కోసం నాలుగుసార్లు ఆసుపత్రులకు రావాల్సి వచ్చిందన్నారు. రోడ్ల దుస్థితి వల్లే తనకు ఈ సమస్యలు వచ్చాయని వైద్యులు ధ్రువీకరించారని తెలియజేశాడు.
ALSO READ: కరోనా రీఎంట్రీ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?
దివ్య కిరణ్ తరఫు ఆయన న్యాయవాది లవీన్ ఆరు రోజుల కిందట అంటే మే 14న బెంగుళూరు నగరపాలిక సంస్థకు నోటీసును బీబీఎంపీకి పంపారు. తన క్లయింట్ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. పలుమార్లు ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించారు గుర్తు చేశారు. నొప్పి భరించలేక నాలుగుసార్లు అత్యవసర చికిత్స తీసుకున్నారని గుర్తు చేశారు.
ఇప్పటికీ అనేక మందులు వాడుతున్నారని అడ్వకేట్ పేర్కొన్నారు. ఈ సమస్యల వల్ల తన క్లయింట్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఆయన దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రస్తావించారు. రెండువారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు కిరణ్.
అలాగే లీగల్ ఖర్చుల కింద 10 వేలు చెల్లించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరు రోడ్లు దారుణంగా ఉన్నాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నాడు. మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం చూపుతున్నారని విచారం వ్యక్తం చేశాడు.
అందుకే నోటీసు పంపానని, అవసరమైతే న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని మీడియాకు తెలిపాడు. కిరణ్ నోటీసుపై ఇప్పటి వరకూ స్పందించలేదు బీబీఎంపీ. రిప్లై ఇస్తుందా? లేదా అన్నది చూడాలి.