Agri Budget: అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ఈ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయమేనన్నారు. వ్యవసాయం గొప్పతనం, ప్రాముఖ్యతను ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పిన మాటలను మంత్రి గుర్తు చేశారు.
రైతులను స్థితి మంతులుగా చూడాలనే ఉద్దేశంతో స్వార్ణాంధ్ర -2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 22.86 శాతంగా నమోదు అయ్యింది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించిందన్నారు. కేవలం కూటమి సర్కార్‌లో 13.09 కోట్లతో 4.30 లక్షల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించినట్టు చెప్పారు.
ఈ ఏడాది ఆరు లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు మంత్రి. ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యంత్రాల రాయితీ, డ్రోన్ల రాయితీకి భారీ కేటాయింపులు చేశారు. దీనివల్ల రైతులకు మేలు చేకూరనుందని చెప్పుకొచ్చారు.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు కేటాయించారు విత్త మంత్రి గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని ప్రకటించారు. రైతులకు దాదాపు 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామన్నారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం చేపట్టామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అలాగే అర్హులైన కౌలు రైతులకు కార్డులు మంజూరు చేస్తామన్నారు.
వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు
-వ్యవసాయ శాఖకు రూ.12,401 కోట్లు
-అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ అమలు రూ.9,400 కోట్లు
-ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు
-వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు
-ఎరువుల స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు
-ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ.61 కోట్లు
-విత్తన రాయితీ పంపిణీ రూ.240 కోట్లు
-వ్యవసాయ యంత్రాల రాయితీ రూ.139 కోట్లు
-రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు
-పశుసంవర్థకశాఖ రూ.1,112.07 కోట్లు
-డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు
-ఉద్యాన శాఖ రూ.930.88 కోట్లు
-మత్స్య రంగానికి రూ. 540.9 కోట్లు
-సహకారశాఖ రూ.239.85 కోట్లు
-పట్టు పరిశ్రమ రూ.96.22 కోట్లు
-7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశాం
-875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు
ALSO READ: ఏపీలో ఒంటిపూట బడులు