AP Half Day Schools: ఏపీలో ఒంటి పూట బడుల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేసవి కాలం ఒంటి పూట బడులపై వినతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సాధ్యమైనంత త్వరగా ఒంటిపూట బడులను నిర్వహించాలని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంది. కాగా మార్చి నెలలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం సైతం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైంది.
ఏపీలో సమ్మర్ సీజన్‌కు ముందుగానే ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎండల ధాటికి వేడిగాలులు సైతం అధిక స్థాయిలోనే వీస్తున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు ఎండలో బయటకు వచ్చేందుకు సాహసించని పరిస్థితి. సాయంత్రం 5 గంటల తర్వాత వాతావరణం కాస్త చల్లబడుతుండగా కాస్త ఉపశమనం లభిస్తుందని ఏపీ ప్రజలు తెలుపుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఒంటిపూట బడుల నిర్వహణ సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్ కు తగినట్లుగానే ఏపీ ప్రభుత్వం ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుండి ఒంటి పూట బడులను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సుమారు 37 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: Today Gold Price: మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..
ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు..
ఏపీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు అధికం కాగా సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎండల ధాటికి రోజు వారీ కూలీ పనులకు వెళ్లే కూలీలు, తోపుడుబండ్ల వ్యాపారులు పడుతున్న అవస్థలు ఎక్కువే. అలాగే ఉపాధి హామీ కూలీలు సైతం ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. కూలీలకు సమ్మర్ సీజన్ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. త్వరలోనే ఉపాధి కూలీలు పని చేసే ప్రాంతాలలో టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తదితర సామాగ్రితో పాటు మజ్జిగను సైతం అందిస్తారని తెలుస్తోంది. అయితే పెరుగుతున్న ఎండల ధాటికి విద్యార్థులు గత కొద్దిరోజులుగా ఒంటి పూట బడులపై ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మొత్తం మీద ప్రభుత్వం మార్చి నెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైందని సమాచారం. అలాగే మార్చి 17 నుండి పదవ తరగతి పరీక్షలు ఏపీలో ప్రారంభం కానున్నాయి.