Tirumala Alipiri: తిరుమలకు వెళ్లే భక్తులు ఎప్పుడూ చూసే మార్గం.. అలిపిరి మెట్లు. అక్కడ ప్రకృతి అందాలు మాత్రమే కాదు, కొన్నిసార్లు అరకొర శబ్దాలు, అడవి జంతువుల రాకపోకలు కూడా కనిపిస్తుంటాయి. ఇటీవల జంతువుల సంచారం అధికం కావడంతో టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ రంగంలోకి దిగింది. అందుకే ఇప్పుడు అలిపిరి మార్గంలో ఇప్పుడు ఓ కొత్త అతిథి వచ్చాడు. ఆ అతిధి ఎవరో కాదు ట్రెయిల్ కెమెరా . గడ్డిపోచ కదిలినా ఇది రికార్డు చేస్తుందట. తాజాగా ఫారెస్ట్, టీటీడీ అధికారులు అలిపిరి మార్గంలో తిరిగి, ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే ఈ అధునాతన కెమెరాల పనితీరును వారు పరిశీలించారు. అసలు ఈ కెమెరా ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.
కెమెరా కాదు ఇది గూఢచారి
చూపుతో కాదు, కదలికతో పని చేసే ఈ కెమెరా, చిన్న చలనం గుర్తించినా, వెంటనే ఫ్లాష్ వేయించి ఫోటో తీసేస్తుంది లేదా వీడియో స్టార్ట్ చేస్తుంది. నడుస్తున్న భక్తులతో సహా, ఏ చిన్న అలికిడి ఉన్నా ఇది చూసేస్తుంది. అటు అటవీ శాఖకీ, ఇటు భక్తుల భద్రతకీ ఇది పెద్ద బలమని చెప్పవచ్చు.
బయట ఫ్లాష్, లోపల టెక్నాలజీ..
ఈ ట్రెయిల్ కెమెరాలో మోషన్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ ఫ్లాష్, మంచి నైట్విజన్ సామర్థ్యం ఉండటంతో అర్థరాత్రి అయినా, లోపల ఏమి కదలిక జరిగిందో ఇది రికార్డు చేస్తుంది. చెట్టుకి చుట్టేసేలా అమర్చే ఈ కెమెరా వర్షాలు వచ్చినా, గాలులు వీచినా పాడవదు. అంతే కాదు, దీన్ని రీసెట్ చేయాల్సిన అవసరం కూడా చాలా తక్కువ. పెట్టారంటే అలా పట్టుదలగా పనిచేస్తుంది.
జంతువులకే కాదు.. మనుషులకు హెచ్చరికే
వన్యప్రాణులు తప్పనిసరిగా అలిపిరి మార్గం దాటి పోతుంటాయి. వాటిని గమనించేందుకు దీనిని పెట్టారు. కానీ ఏదైనా తప్పు ఉద్దేశంతో వచ్చిన మనిషైనా, మొబైల్తో సెల్ఫీలు తీసుకుంటూ ట్రై చేస్తున్నా, జాగ్రత్త.. ఈ కెమెరా చూస్తోంది. ఈ కెమెరా భద్రతకు మారుపేరని చెప్పవచ్చు.
Also Read: National Highways: ఏపీకి భారీ గిఫ్ట్.. జస్ట్ గంటన్నరలో నెల్లూరుకు.. ఇదేం రోడ్డు బాబోయ్..
తిరుమల భక్తులకు భద్రత.. జంతువులకు గౌరవం
ఇటువంటి కెమెరాల వల్ల అటవీ శాఖకు ఉపయోగం ఏంటంటే.. ఏ జంతువు ఎప్పుడు వస్తోంది? అది ప్రమాదకరమా? ఏ సమయంలో ఎక్కువ కదలికలు ఉన్నాయి? అన్నీ అంచనా వేయవచ్చు. తిరుమలకు వచ్చే భక్తులకు ఇది ఒక భద్రతా పటిష్టతగా కూడా నిలుస్తోంది. ఈ కెమెరా ముందు ఎవ్వరూ తప్పించుకోలేరు. అది గడ్డిపోచ అయినా, మనిషి అయినా సరే. అందుకే అలిపిరి మార్గంలో చల్లగా నడుస్తూ, ప్రశాంతంగా దర్శనం సాగించండి. ఎందుకంటే… ఇక ఒక్క కదలికైనా.. రికార్డే!