National Highways: ఆ రూట్ లో ఏ వాహనం వెళ్లాలన్నా భయంభయం. మేము వెళ్లము మొర్రో అంటూ ఆ రూట్ లో వెళ్లే డ్రైవర్స్ నోటి మాట ఎప్పుడూ వినిపించేది. కానీ ఇప్పుడు ఈ శుభవార్త వింటే, ముందు ఆ డ్రైవర్లు ఎగిరి గంతేస్తారు. ఔను, చెన్నైకి వెళ్లేందుకు ఆ రూట్ కీలకం. సాధారణంగా ఈ రూట్ లో చెన్నై వెళ్లాలంటేనే 9 గంటలు తిప్పలు తప్పవు. కానీ కేంద్రం ఇప్పుడు ఈ రహదారి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా ఇలా కాదు.. ఇక వాహనాలు దూసుకెళ్లడమే. ఇంతగా చెప్పిన ఈ దారి ఎక్కడో కాదు.. ఏపీలో ఉంది.
ఈ దారిలో తిప్పలు తప్పలేదు
ఏపీలోని కడప జిల్లా బద్వేలు నుండి నెల్లూరు మీదుగా చెన్నై వెళ్లే వాహనాలు అధికం. సాధారణంగా కడప జిల్లా అంటేనే కువైట్, సౌదీ వలస వెళ్లి జీవించే వారు అధికం. అలా సౌదీకి వెళ్లేవారు ఎక్కువగా చెన్నై విమానశ్రయానికి ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాకుండా ఏపీ నుండి వైద్యశాలల నిమిత్తం చెన్నై వెళ్లేవారు అధికం. అందుకే ఈ దారి కీలకం. రహదారి అభివృద్ధి కోసం ఎప్పటి నుండో ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఈ రహదారి తిప్పలు తప్పుతాయని అనుకుంటున్న తరుణంలో అసలు శుభవార్త వచ్చేసింది.
వచ్చేసింది శుభవార్త..
ఆంధ్రప్రదేశ్ రవాణా రంగ అభివృద్ధిలో మరో పెద్ద ముందడుగు పడింది. కేంద్ర మంత్రివర్గం తాజాగా బద్వేల్ – నెల్లూరు మధ్య 4 లైన్ల హైవే ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ఈ హైవే రాష్ట్రానికి మౌలిక సదుపాయాల పరంగా ఎంతో మేలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. బద్వేల్ (కడప జిల్లా) నుంచి నెల్లూరు జిల్లాలోని గురువిందపూడి వరకు ఈ రహదారి విస్తరించనుంది. ఈ హైవే జాతీయ రహదారి 67 (NH-67) నుంచి ప్రారంభమై, జాతీయ రహదారి 16 (NH-16) వద్ద ముగుస్తుంది.
ఈ కొత్త హైవే పొడవు 108.13 కిలోమీటర్లు. దీన్ని రూ. 3653.10 కోట్ల అంచనా వ్యయంతో BOT (టోల్) మోడల్‌లో నిర్మించనున్నారు. అంటే ప్రైవేట్ సంస్థ నిర్మాణం చేసి, టోల్ ద్వారా ఖర్చును తిరిగి పొందుతుంది. అనంతరం అది ప్రభుత్వానికి బదలాయించబడుతుంది. ఇది ప్రభుత్వ ఖజానాపై భారం లేకుండా మౌలిక నిర్మాణం సాధించేందుకు మంచి మార్గం.
పరిశ్రమలకు పండగే..
ఈ హైవే రాష్ట్ర పరిశ్రమలకు బలమైన బలంగా నిలవనుంది. ముఖ్యంగా విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC) లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్-బెంగళూరు కారిడార్ (HBIC) లోని ఓర్వకల్ నోడ్, చెన్నై-బెంగళూరు కారిడార్ (CBIC) లోని కృష్ణపట్నం పోర్టు వంటి పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పిస్తుంది. దీనివల్ల ఉత్పత్తుల రవాణా వేగవంతం అవుతుంది. కొత్త పరిశ్రమలకు అవకాశం కలుగుతుంది. హైవే నిర్మాణం వల్ల పర్యాటక రంగం కూడా లాభపడనుంది.
ముఖ్యంగా శ్రీకాళహస్తి ఆలయం, పెంచలకోన జలపాతాలు, శ్రీశైలం దేవస్థానం, సోమశిల జలపాతాలు, ఉదయగిరి కోట, సిద్ధవట్టం కోట, ఒంటిమిట్ట రామాలయం వంటి 19కి పైగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు సులభ ప్రాప్యత కలుగుతుంది. ఇది స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
Also Read: AP Viral Video: మద్యం మత్తులో యువతి.. రోడ్డుపైనే ఇదేం రచ్చ బాబోయ్.. ఏపీలోనే!
మరోవైపు, ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయాణ దూరం 33.90 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రస్తుతం బద్వేల్ నుంచి కృష్ణపట్నం పోర్టు దూరం 142 కిలోమీటర్లు కాగా, ఈ హైవే వల్ల అది 108.13 కిలోమీటర్లకు పరిమితమవుతుంది. అదే విధంగా ప్రయాణ సమయం కూడా 2.5 గంటల నుండి 1.5 గంటలకు కుదిరే అవకాశం ఉంది. అంటే సమయపరంగా 40% పొదుపు సాధ్యం అవుతుంది.
ఇది కేవలం ప్రయాణికులకే కాకుండా వాణిజ్యరంగానికీ ఉపయోగపడుతుంది. వేగంగా సరుకు రవాణా చేయడమేకాకుండా, ఇంధన ఖర్చులు తగ్గించి వాహన నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఇది దోహదం చేస్తుంది. ఈ మార్గం ద్వారా ప్రస్తుతం ఉన్న NH-67, NH-16 రద్దీని కూడా తగ్గించవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, పర్యాటక రంగ ప్రోత్సాహం, వాతావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో ప్రయోజనాలను అందించనుంది. రాష్ట్ర ప్రజల కోసం ఒక అభివృద్ధి మార్గంగా మారుతుంది. ఇది కేవలం రహదారి కాదు, రాష్ట్ర ప్రగతికి బంగారు బాటగా చెప్పవచ్చు. చివరగా ఒక మాట.. ఇక ఈ రహదారిలో చెన్నై వెళ్లాలంటే కేవలం 5 గంటల్లో రయ్.. రయ్ మంటూ రాకపోకలు సాగించవచ్చు. అంతేకాదు బద్వేల్ నుండి నెల్లూరుకు ఇక గంటన్నరలో మీ ప్రయాణం సాఫీగా సాగిపోద్ది.
Game-changing 4-lane Badvel–Nellore highway to reshape Andhra Pradesh’s connectivity! 🛣️✨
Union Cabinet, chaired by Prime Minister Shri @narendramodi Ji, has approved the development of a 4-lane Badvel–Nellore highway in the state of Andhra Pradesh. The project will extend from… pic.twitter.com/HglSh5jxjc
— Nitin Gadkari (@nitin_gadkari) May 28, 2025