BigTV English

Kapu Politics In AP : ఆ వర్గంపై అన్ని పార్టీల గురి.. కాపు కాసేదెవరికి..?

Kapu Politics In AP :  ఆ వర్గంపై అన్ని పార్టీల గురి.. కాపు కాసేదెవరికి..?

Kapu Politics In AP : ఏపీ ఎన్నికల్లో కుల రాజకీయాలు చాలా కీలకంగా పని చేస్తుంటాయి. ఎప్పుడైనా ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అందుకు భిన్నమైన వాతావరణమేమీ లేదు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ అంతా కుల సమీకరణాల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కాపుల సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ విషయం తిరుగుతోంది. ఆయన్ను అన్ని పార్టీలూ ఆహ్వానిస్తున్నాయి. అయితే నిజంగానే కాపు ఓట్లు ఒకవైపే ఉంటాయా? కాపు ఓట్లతోనే అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఉందా?


ఏపీలో కుల సమీకరణాలు, రాజకీయాలు హైపిచ్ కు చేరాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ సీన్ మారిపోతోంది. ముఖ్యంగా కాపుల ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు పెంచుతున్నాయి. గుంపగుత్తగా ఒకవైపే ఓట్లు పడుతాయన్న నమ్మకంతో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలన్నీ కాపు సామాజికవర్గం ఓట్లపైనే గురి పెట్టాయి. ఇప్పటికే వారిని ఆకర్షించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాపులకు నేనున్నానంటూ జగన్ ప్రభుత్వం కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తోంది. అయితే మారిన రాజకీయ సమీకరణాలతో ముద్రగడ పద్మనాభం తీసుకోబోయే నిర్ణయం కూడా కీలకంగా మారుతోంది.

కాపులంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిస్తున్నారు. అందరితో కలిసి పని చేస్తానంటున్నారు. దీంతో ముద్రగడ పద్మనాభం ఆలోచిస్తున్నారు. అటు కాపులు కూడా ఈసారి ఈ సెంటిమెంట్ ను పట్టుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఎవరో ఒక్కరికే ఓటేయాలి గెలిపించాలి అన్న చర్చ కాపు సామాజికవర్గంలో జరుగుతోందంటున్నారు. అది కూడా తమ సామాజికవర్గానికి చెందిన వారికే జై కొట్టాలన్న ఆలోచనతో ఉన్నారంటున్నారు.


బీసీల తర్వాత అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గం ఓట్లు ఎన్నికల్లో కీలకం కావడంతో పార్టీలన్నీ అటే ఫోకస్ పెట్టాయి. జనాభాపరంగా చూస్తే ఏపీలో 27శాతం మంది కాపులు ఉన్నారు. వారు ఎవరికి మద్దతిస్తే వాళ్లదే ఏపీలో అధికారం అన్నట్లుగా సీన్ నడుస్తోంది. గత ఎన్నికల్లో మెజార్టీ కాపులు వైసీపీ వైపు నిలిచారు. ఆ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఏపీలో అయితే రెడ్లు, లేదంటే కమ్మ సామాజికవర్గం చుట్టే పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఆధిపత్య పోరాటం ఈ రెండు సామాజికవర్గాల నుంచే ఉంటాయి. ఏపీలో అధికారం చేపట్టాలంటే కాపుల ఓట్లు, వారి మద్దతు చాలా కీలకం అవుతుంటుంది.

అన్ని కులాల్లో ఐకాన్‌లుగా ఉన్న కుటుంబాలకు దగ్గరయ్యేందుకు అధికార వైసీపీ వ్యూహాలు పన్నుతుండగా.. అలర్ట్‌ అయిన జనసేన కూడా ఆహ్వానాలు పంపుతోంది. అందరితో కలిసి పని చేసేందుకు సిద్ధమంటోంది. ముఖ్యంగా ఇప్పుడు కాపు నేతల్లో కీలకంగా ఉన్న వారి కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. 2019లో కాపు ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొని ముద్రగడకు దగ్గరైన వైసీపీ మరోసారి ఆ వర్గంలో పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యమాలకు పరిమితమైన పద్మనాభాన్ని ఎన్నికల రణక్షేత్రంలోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. జనసేన-టీడీపీ కూటమిని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో ఢీకొట్టాలంటే ముద్రగడ వంటి సీనియర్లు అవసరముందని సీఎం జగన్‌ అనుకుంటున్నారు. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోనూ పట్టు చేజారకుండా ఉండేందుకు వంగవీటితో మంత్రాంగం నడుస్తోంది. ఇప్పటికే కాపు సామాజికవర్గంలోని కొందరు నాయకులు అధికారపార్టీకి మద్దతుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇవన్నీ మొన్నటిదాకా. ఇప్పుడు సీన్ మారిపోయింది.

జగన్ వ్యూహాలతో అలర్ట్‌ అయిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి సొంత సామాజికవర్గం నేతలు, ప్రజలకు బహిరంగలేఖ రాశారు. కొందరు పెద్దలు తనను దూషించినా దీవెనలుగానే తీసుకుంటానని చెప్పడం ద్వారా ఒక మెట్టు తాను దిగేందుకు సిద్ధమే అని సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దు అన్న ఉద్దేశంతో ఉన్న పవన్.. టీడీపీతో జట్టు కట్టారు. అదే సమయంలో తమ సామాజికవర్గం ఓట్లు చీలకుండా వ్యూహంతో ఉన్నారు. కాపుల్లో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని, అంతా అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసిందంటున్నారు పవన్‌. కుల పెద్దలు ఎప్పుడు తన పార్టీలోకి వచ్చినా ద్వారాలు తెరిచే ఉంటాయంటూ సీనియర్లకు స్వాగతం పలికేశారు. కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం జగ్గంపేట నుంచే రిజర్వేషన్లు సాధ్యం కాదని జగన్ చెప్పినా ఆయనకు మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.

మరోవైపు కాపులను తమవైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమవుతోంది. అవసరం అయితే ఉభయగోదావరి జిల్లాల్లో మిత్రపక్షం జనసేనకు ఎక్కువగా సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటోంది. ఇక కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేనంటోంది తెలుగుదేశం. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు ఏ పార్టీవైపు క్లీన్ స్వీప్ అయితే.. ఆ పార్టీకి అధికారం వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. టీడీపీతో పొత్తులో భాగంగా కాపు సామాజిక వర్గ ఓట్లు అధికార వైసీపీకి పడకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహారం నడుపుతున్నారు. అయితే ముద్రగడలాంటి కాపు సామాజిక వర్గ నేత తటస్థంగా ఉండడంతో అధికార, విపక్షాలు తమదైన ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ఆయన్ను చేర్చుకుంటే.. కాపు వర్గం ఓట్లను ప్రభావితం చేయొచ్చనుకుంటున్నారు.

2014 నుంచి 2019 మధ్య కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ నడిపించారు. ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేసిన తుని సభ తర్వాతే.. రైలుకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొని ముద్రగడకు దగ్గరైన వైసీపీ.. మరోసారి ఆ వర్గంలో పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలా సార్లు ముద్రగడ పద్మనాభం మాట్లాడారు. టీడీపీకి మద్దతు ఇవ్వడంపై పవన్ కల్యాణ్ పైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు.. అదే టీడీపీ తరఫున జ్యోతుల నెహ్రూ వెళ్లి ముద్రగడని కలిశారు. టీడీపీలో చేరాలని ఆయన్ని కోరారు. మరోవైపు.. జనసేన తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి, పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ప్రత్తిపాడు నుంచి పోటీ చేయాలని జనసేన నుంచి ముద్రగడకు ఆహ్వానం అందింది. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడని కలుస్తారని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.

ముద్రగడ చేరితే కాపు ఓటు బ్యాంక్ తమవైపే ఉంటుందన్న ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. అందుకే ముద్రగడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కాపులను ఆయన ఇంకా ప్రభావితం చేసే పరిస్థితి ఉందా అన్న చర్చ జరుగుతోంది. అయితే గెలుపు కోసం ఏ చిన్న ప్రయత్నం కూడా విడిచిపెట్టొద్దన్న ఆలోచనతో వైసీపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి. అయితే పద్మనాభం కోసం రాయబారాలు తీవ్రస్థాయిలో నడుస్తున్న వేళ ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారన్నది కీలకంగా మారింది. ముద్రగడ పద్మనాభం 2009 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది ఇప్పుడు రాజకీయ పార్టీల ఆహ్వానంతో పోటీలోకి దిగే పరిస్థితి ఉందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

గత ఏడాది మేలోనే తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వేకోర్టు ముద్రగడను నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో పద్మనాభం ఇటీవలే ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన జాతిని అమ్మకం పెట్టడం గానీ, తాకట్టు పెట్టడం గానీ చేయలేదన్నారు. ఉద్యమాలే ఊపిరిగా నడిచానని, జీవితమే పోరాటం, పోరాటమే జీవితంగా ఉద్యమాలు చేశానన్నారు. తనకు పదవీ కాంక్షలేదని, గతంలో ఎన్నో పదవులు వదులుకున్నానని ముద్రగడ అప్పటి లేఖలో గుర్తుచేశారు. త్వరలో రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తానని కూడా చెప్పేశారు. ఆ ప్రకారమే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి మరోసారి వస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.

.

.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×