ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిద్రపట్టడం లేదని చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఆయన మరోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తుండగా అది సాధ్యమయ్యే దారులను చంద్రబాబు అండ్ కో మూసివేస్తున్నదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కూటమి సర్కారుపై మొన్నటివరకు వరుస విమర్శలు చేసిన వైసీపీ నేతలకు ఇప్పుడు విమర్శలు చేద్దామంటే టాపిక్ దొరకడం లేదని తెలుస్తోంది. సిక్స్ గ్యారంటీస్‌పై జగన్ అండ్ కో ఎంత రచ్చ చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.అందుకే ఆయనకు ఏం చేయాలో తోచడం లేదని, ప్రజలు తనవైపు లేకుంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఎలా అని తన సన్నిహితుల వద్ద చర్చించినట్టు తెలుస్తున్నది.
జగన్ పాచికలు పారకుండా సీఎం చంద్రబాబు అమరావతి అస్త్రాన్నిఆయన మీదకు వదిలారు. ఇంకేముంది ఏపీ ప్రజలంతా అమరావతికి జై కొడుతుంటే .. వైసీపీ నేతలు, జగన్ మాత్రం అమరావతికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.కనీసం తాము సపోర్టు చేస్తున్నామని ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. దీనిని బట్టి అమరావతిని రాజధానిగా చేసేందుకు వైసీపీ ఇష్టపడటం లేదని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇదే అంశం మీద పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించి తీరుతామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్నవిధంగానే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి పంపించారు. బుధవారం అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టగా.. ఎన్డీయేతో పాటే కాంగ్రెస్ సైతం దీనికి మద్దతు పలికింది.
ఇక్కడ ఆమోదం పొందిన అనంతరం దానిని రాజ్యసభకు పంపించనున్నారు. అక్కడ కూడా ఆమోదం పొందాక రాష్ట్రపతి సంతకం కోసం బిల్లును పంపించనున్నారు. ప్రెసిడెంట్ సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. గెజిట్ విడుదల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఏర్పాటు కానుంది. ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన దానిని మార్చడం వీలు కాదు. ఒకవేళ మరల జగన్ ప్రభుత్వం కొలువుదీరినా మూడు రాజధానుల అంశాన్ని మరోమారు తెరమీదకు తెచ్చినా కేంద్రం అందుకు అంగీకరించదు. రాజధాని డెవలప్మెంట్ కోసం నిధులు కోరితే అమరావతిలోనే నిర్మాణాలు జరగాలి.లేకుండా వేరేచోట నిర్మాణాలకు కేంద్రం అంగీకరించదు. నిధులు సైతం విడుదల చేయదు. ఫలితంగా మరల రాష్ట్ర ఖజానా నుంచే నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇండియన్ నేవీలో అగ్నివీర్ కొలువులు.. మంచి భవిష్యత్తు, ఇంకెందుకు ఆలస్యం
ఇదిలాఉండగా, మాజీ సీఎం జగన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధత పేరిట చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బాబు గతంలో ఐదేండ్లు, ఇప్పుడు రెండేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని.. అయినా, అమరావతిలో పూర్తిగా నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు.ఏడేండ్ల సమయం వృథా చేసిన చంద్రబాబు.. కొత్తగా మరోసారి అమరావతి రైతుల నుంచి భూములు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మరో లక్ష ఎకరాలను రైతుల నుంచి తీసుకుని వారికి ఏవిధంగా నష్టపరిహారం ఇస్తారని.. పెట్టుబడులు ఎప్పుడు రావాలి? అభివృద్ధి ఎప్పుడ జరగాలి? అని ప్రశ్నించారు. రైతుల నుంచి భూమి సేకరించకుండానే అమరావతి రాజధాని కోసం తాను ‘ప్లాన్ బి’ చెబితే చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. మొత్తం మూడు రాజధానుల అంశం పక్కకు పోయినట్టు తెలుస్తుండగా.. జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందా? అనేది తెలియాల్సి ఉంది.