ఆరె శ్యామల. ప్రముఖ తెలుగు యాంకర్. వైసీపీకి ఆమె అధికార ప్రతినిధి. అయితే ఆ ప్రతినిధి పదవి ఉందా, ఊడిందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఇటీవల ఆమె బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీస్ విచారణకు హాజరయ్యారు. దీంతో శ్యామలను వైసీపీ పక్కనపెట్టేసిందని అనుకున్నారంతా. శ్యామల కూడా ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనపడలేదు. పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదు, ప్రెస్ మీట్లలో కూడా ఆమె లేరు. దీంతో శ్యామలను పార్టీ వదిలించుకుందేమోననే అనుమానాలు బయటపడ్డాయి. కానీ అది నిజం కాదంటూ ఆమె కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో ఉంచారు.
ఒంగోలు పట్టణం నందు రాజ్యసభ సభ్యులు Y.V సుబ్బారెడ్డి గారి మాతృమూర్తి పిచ్చమ్మ గారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.#YSRCongressParty #AndhraPradesh pic.twitter.com/hikWT08sBd
— Are Syamala (@AreSyamala) March 31, 2025
విచారణకు హాజరైన శ్యామల
బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామల పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఉండటంతో వైసీపీ తెగ ఇబ్బంది పడిపోయింది. పోలీస్ కేసులో ఉన్నవారిలో శ్యామలను మినహాయించి మిగతా వాళ్ల పేర్లు మాత్రమే సాక్షిలో ప్రచురించేవారు. అలా శ్యామలను కవర్ చేశారు. కానీ చివరకు శ్యామల కూడా పోలీస్ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. తాను పూర్తిగా విచారణకు సహకరిస్తానని, బెట్టింగ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటూ.. పెద్ద డైలాగులే చెప్పారామె. ఆ సంగతి పక్కనపెడితే శ్యామల తిరిగి రాజకీయాల్లోయాక్టివ్ అవుతారా లేదా అనే చర్చ మొదలైంది.
శ్యామలకు పదవీగండం అంటూ ప్రచారం..
బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేసిన సెలబ్రిటీల్లో శ్యామల కూడా ఉండటంతో పొలిటికల్ గా ఆమెను వైసీపీ పక్కనపెడుతుందేమోనని అనుకున్నారంతా. ఆ కేసులో శ్యామల పేరు బయటకు రావడంతో పరోక్షంగా వైసీపీని వైరి వర్గం టార్గెట్ చేసింది. ఆ పార్టీ అధినేతలు నీతులు చెబుతారు, అధికార ప్రతినిధులు ఇలా బెట్టింగ్ యాప్స్ తో ప్రజల జీవితాలతో ఆడుకుంటారంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆ నాలుగైదు రోజులు ఆ వార్తల్ని కవర్ చేయలేక, ఒకవేళ కవర్ చేసినా, అందులో శ్యామల పేరుని కవర్ చేయలేక సాక్షి మీడియా కూడా ఇబ్బంది పడిపోయింది. ఇంకేముంది శ్యామల అధికార ప్రతినిధి పదవికి చెల్లుచీటీ రాసేస్తారని అనుకున్నారు.
పార్టీకి శ్యామల అవసరం..
ఆల్రడీ వైసీపీనుంచి కీలక నేతలంతా బయటకు వెళ్లిపోతున్నారు. కనీసం పార్టీకోసం బలంగా మాట్లాడతారు అనుకున్నవాళ్లు సైలెంట్ గా ఉంటున్నారు. ఈ దశలో తొందరపడి శ్యామలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమో లేక, పూర్తిగా పక్కనపెట్టడమో జరుగుతుందని ఆశించలేం. జగన్ కూడా ఆ విషయంలో తొందరపడలేదు. శ్యామలకు వైసీపీ అవసరం కంటే.. పార్టీకే ఆమె అవసరం ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆమెపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అసలు ఆమెకు, ఆ కేసుకి సంబంధం ఉన్నట్టు కూడా ఎక్కడా వైసీపీ నేతలు మాట్లాడటంలేదు. తాజాగా ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వచ్చారు శ్యామల. సుబ్బారెడ్డి తల్లి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇక్కడ వైసీపీ నేతలందర్నీ ఆమె కలిశారు. ఆ ఫొటోలను కూడా ప్రత్యేకంగా షేర్ చేశారు. దీంతో ఆమె వైసీపీతోనే ట్రావెల్ అవుతున్నట్టు స్పష్టమైంది. సో.. భవిష్యత్తులో వైసీపీ వాయిస్ ని శ్యామల మరింత గట్టిగా వినిపిస్తారనమాట.