AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలిలో పలు రంగాల అభివృద్ధికి.. సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా మెట్రో రైలు ప్రాజెక్టుల పురోగతి, విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి, భూబ్యాంకుల ఏర్పాటుకు భూ కేటాయింపులు, భారీ పెట్టుబడులకు అనుమతులు ఉన్నాయి.
మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులపై.. మొదటి దశలో టెండర్లు పిలవడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు కింద రెండు కారిడార్ల ఏర్పాటుకు అనుమతి దశలో ఉంది. ఈ రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి.. దాదాపు 40 శాతం విలువైన పనులకు టెండర్లను త్వరలో పిలవనున్నారు. ఇది నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాకుండా, సామూహిక రవాణా వ్యవస్థను బలోపేతం చేయనుంది.
విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణాన్ని.. ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిశ్చయించింది. ఈ క్రమంలో విస్తీర్ణమైన భూములను కేటాయిస్తూ, పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కలిపి మొత్తం 1,941.19 ఎకరాల భూమిని భూబ్యాంకు కోసం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ భూమిని 2016లో రూపొందించిన విశాఖ అర్బన్ ల్యాండ్ పూలింగ్ పథకం నిబంధనల ప్రకారం.. తీసుకునేలా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి (VMRDA) అనుమతి ఇచ్చారు.
ఎలక్ట్రానిక్ పరిశ్రమకు నూతన ఉత్సాహం
రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో ముందుండేలా.. తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0 (Manufacturing 4.0)కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా విడిభాగాలతో సహా పరికరాల తయారీ పూర్తి స్థాయిలో.. రాష్ట్రంలోనే జరిగే అవకాశం ఉంది. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
రూ.79,900 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో.. ఈ మంత్రిమండలి సమావేశం కీలకంగా నిలిచింది. ప్రభుత్వం మొత్తం రూ.79,900 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. వీటి ఫలితంగా ఐటీ, ఇంధన రంగాల్లో దాదాపు 1.50 లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి పార్థసారధి వెల్లడించారు. రాష్ట్రం వ్యాప్తంగా పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు.. యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Also Read: జగన్ జైలుకెళ్తే జరిగేది అదే..! పార్టీపై సజ్జల పెత్తనం కోరుకుంటున్నారా?
రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు
ఈ మంత్రిమండలి నిర్ణయాలు చూస్తే ప్రభుత్వం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగాలను ప్రోత్సహించడంలో.. ఎంత ఆసక్తి చూపుతోందో స్పష్టంగా తెలుస్తోంది. మెట్రో రైలు ప్రాజెక్టులు, ఐటీ హబ్‌ల ఏర్పాటు, భూబ్యాంకుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్ తయారీ విధానం వంటి అంశాలు.. రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.