AP Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అది వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం ఏపీ, ఒడిషా రాష్ట్రాలపై పడనుంది. ప్రస్తుతం దక్షిణ ఒరిస్సా-ఉత్తరాంధ్రపై కొనసాగుతోంది అల్పపీడనం. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీకి మరో గండం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ-IMD మంగళవారం తెలియ జేసింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి గురువారం నాటికి వాయుగుండంగా మారనుంది. శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది.
బుధవారం, గురువారం ఏపీలోని కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలోని కొన్ని ప్రదేశాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
నేడు-రేపు భారీ వర్ష సూచన
ఇక శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లాల వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ కేంద్రం. రానున్న మూడు రోజులు ఏపీలోని భారీగా వర్షాలు పడతాయని చెప్పింది. తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
అలాగే భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద, పాడుపడిన భవనాల్లో ప్రజలు ఉండొద్దని సూచన చేసింది. మరోవైపు అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశించింది.
ALSO READ: షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం..
ముగిసిన వర్షాకాలం
ఈ ఏడాది వర్షాకాలం మంగళవారంతో ముగిసింది. వర్షపాతం సాధారణం కన్నా 8 శాతం అధికంగా నమోదైంది. ఈ విషయాన్ని భారత వాతావరణ కేంద్రం తెలిపింద. జూన్- సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు. ఈసారి 937.2 మిల్లీమీటర్లుగా నమోదైంది.
దక్షిణాదిలో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో సగటు కన్నా 112 శాతం అధిక వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ అంచనా. నైరుతి రుతుపవనాల వల్ల జూన్ నుంచి సెప్టెంబరు వరకు విస్తారంగా వర్షాలు కురిసినట్టు ఐఎండీ తెలిపింది. అలాగే అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
అక్టోబరులో ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఐఎండీ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలో అక్టోబరులో సాధారణం కన్నా 15 శాతం అధిక వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. తూర్పు ఈశాన్య, వాయవ్య భారతంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉండనున్నాయి.