AP Rain Alert: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు(అక్టోబర్ 1) బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎల్లుండికి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది.
అల్పపీడనం ప్రభావంతో బుధవారం ఏపీలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. రేపు శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏలూరు జిల్లాతోపాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లా్ల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ తెలిపింది. దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,69,188 క్యూసెక్కులు ఉందన్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు.7 లక్షల క్యూసెక్కుల లోపు వరద చేరే అవకాశం ఉందన్నారు.
గోదావరి నది భద్రాచలం వద్ద 50.30 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 11,03,802 క్యూసెక్కులు రావండోతో మొదటి హెచ్చరిక కొనసాగుతుందన్నారు. దాదాపు 12 నుంచి 12.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చి అనంతరం గురువారం నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.