Dimple Hayathi:సినిమాల కంటే కూడా వివాదాలు, వరుస గ్లామర్ ఫోటోషూట్స్ తో భారీ పాపులారిటీ అందుకుంది హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi).. మొన్నటికి మొన్న తన అపార్ట్మెంట్ లో పార్కింగ్ విషయంలో ఏకంగా డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవపడి కేస్ ఎదుర్కొన్న ఈమె.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. అంతేకాదు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏకంగా ఈమెపై పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. డింపుల్ హయతి భర్త తమ పెంపుడు కుక్కల్ని చూసుకోవడానికి ఒడిస్సా నుండి ఇద్దరు యువతులను పిలిపించుకున్నారట. వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, వారితో బలవంతంగా పనులు చేయించుకుంటూ, తర్వాత ఇంటి నుంచి బయటకు పంపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డింపుల్ భర్త వారిని తీవ్రంగా అవమానపరిచినట్లు బాధిత యువతులు చెబుతున్నారు. అంతేకాదు డింపుల్ కూడా భర్తతో కలిసి.. “మీ ప్రాణం నా చెప్పుల ఖరీదుకు కూడా సరిపోదు. నా భర్త లాయర్. మీవల్ల ఏమీ కాదు.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి ” అని బెదిరించారట. పైగా జీతం కూడా ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని బాధిత యువతుల పరిస్థితిని వివరిస్తూ.. వారిని ఇక్కడికి తీసుకొచ్చిన ఒక మహిళ స్వయంగా వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.
డింపుల్ హయతిపై కేసు ఫైల్..
ఇకపోతే ఆ మహిళ ఆ ఇద్దరు బాధిత యువతులను తీసుకొని ఫిలింనగర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా.. ఆ యువతుల సమాచారం మేరకు పోలీసులు డింపుల్ హయతీతో పాటు ఆమె భర్తపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “డింపుల్ హయతి, ఆమె భర్త మాతో ఇంట్లో పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు. కుక్క అరిచిందని చెప్పి మమ్మల్ని నగ్నంగా చేసి కొట్టేందుకు ప్రయత్నించారు. నగ్న వీడియోలు కూడా తీసేందుకు ప్రయత్నించారు. మా చేత ఇంట్లో పని చేయించుకుని డబ్బు ఇవ్వకుండా బయటకి పంపేశారు. చిత్రహింసలు చేసిన హయతి, ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని” తమ వాంగ్మూలంలో ఆ పని మనుషులు ఇద్దరు తెలిపినట్లు సమాచారం. పని మనుషులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ జంటపై పోలీసులు క్రిమినల్ కేస్ ఫైల్ చేశారు. మరి ఈ ఘటనపై డింపుల్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.
కెరియర్ పై ఇది ప్రభావం చూపనుందా?
అసలే మొన్నామధ్య అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా ఉన్న డింపుల్ ఇప్పుడే ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో పని మనుషులను వేధించారనే కేసులో ఇరుక్కోవడం చాలా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ వివాదం అటు ఈమె కెరియర్ పై నెగటివ్ ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదని సినీవర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.