CM Jagan Bus Yatra Starts form Idupulapaya: సెంటిమెంట్ మళ్లీ మొదలుపెట్టారు సీఎం జగన్. అధికారంలోకి రావడానికి తొలుత ఇడుపులపాయను వేదికగా చేసుకున్నారు. ఇప్పుడూ అక్కడి నుంచే.. కాకపోతే పాదయాత్రకు బదులు ఈసారి బస్సు యాత్రను ఎంచుకున్నారు. మధ్యాహ్నం ఇడుపులపాయ వేదికగా సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు పార్టీ నేతలు.
ఈ మధ్యకాలంలో సీఎం జగన్ నోటి వెంట తరచూ వినిపించే మాట వై నాట్ 175. ఈ స్లోగన్ మొదట్లో బాగానే పాపులర్ అయ్యింది. దీన్ని నిజం చేసేందుకు ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు సీఎం జగన్. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఘాట్‌కి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించనున్నారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు.
తొలి మూడు రోజులు 350 కిలోమీటర్లు ట్రావెల్ చేసేలా ప్లాన్ చేశారు నేతలు. తొలిరోజులు టార్గెట్ 100 కిలోమీటర్లు తిరగాలన్నది ఆలోచన. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు బస్సు యాత్ర సాగనుంది. ఇందుకోసం ప్రజలను భారీగా మొహరించనున్నారు. యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందులో భాగంగా ప్రతీ రోజు ఉదయం మేధావులు, స్థానికులతో మమేకంకానున్నారు సీఎం జగన్. వారి నుంచి సూచనలు, సలహాలు, ఐదేళ్లలో తమ పాలన ఎలా ఉంది ఇలా అనేక విషయాల గురించి చర్చించనున్నారు.
Also Read: CM YS Jagan: విశాఖ డ్రగ్స్ కేసులో బీజేపీ హస్తం.. సీఎం జగన్ సంచలన ఆరోపణలు
ఇక అసలు విషయానికొద్దాం.. గడిచిన ఐదేళ్లలో ప్రజలకు దూరంగా ఉన్నారు సీఎం జగన్. ముఖ్యంగా స్కీమ్‌లు ప్రారంభించినప్పుడు మాత్రమే స్టేజీ మీద ప్రజలను కలిసిన సందర్భాలు ఉన్నాయి. మిగతా సమయంలో తాడేపల్లి ప్యాలెస్‌లో ఉండేవారన్నది నిపుణుల వాదన. ప్రజా నేత అయితే.. టూర్‌కి వచ్చేటప్పుడు రోడ్ల పక్కన పరదాలు ఎందుకన్నది సగటు ప్రజల ప్రశ్న. మళ్లీ అధికారం కోసమే ఈ ఎత్తుగడని అంటున్నారు. పరిపాలనపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు చాలామంది సలహాదారులు న్నారంటున్నారు. బస్సు యాత్ర రూపంలో ప్రజల నుంచి సలహాలు తీసుకుని ఏం చేస్తారని పార్టీలోని దిగువ స్థాయి కేడర్ ప్రశ్నిస్తోంది. 21 రోజుల్లో వచ్చే స్పందన నుంచి మేనిఫెస్టోను రెడీ చేయాలన్నది అధినేత ఆలోచనగా చెబుతున్నారు పార్టీ నేతలు.