AP Politics: కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి జాతిపిత గాంధీజీ పేరు మార్చాలని చూడటం ముమ్మాటికీ దేశ ద్రోహపు చర్య అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఏపీలోని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలంతా ఈ బిల్లును అడ్డుకోవాలని సూచన చేశారు.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చింది ఎన్‌డీఏ సర్కార్. ఇకపై ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆ జీవిక మిషన్-గ్రామీణ్’-వీబీ-జీరామ్‌జీ పేరుతో పిలవనున్నారు. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన పథకాల్లో కీలకమైనది ఈ పథకం. ఆ పథకానికి మహాత్మాగాంధీ పేరు ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభలో మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు.
దీనికి సంబంధించిన వీబీ-జీరామ్‌జీ 2025 బిల్లును ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టానికి మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. వికసిత భారత్-2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దారు. పాత చట్టంలో 100 రోజులు ఉపాధి ఉండేది. కొత్త బిల్లులో 125 రోజులకు పెంచారు.
100 రోజుల నుంచి 125 రోజులకు పెంపు, కీలక సవరణలు
ఈ పథకం తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితి ఇప్పుడు లేదన్నది మంత్రి మాట. మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని సభలో వెల్లడించారు. వికసిత భారత్.. గ్రామీణ మౌలిక సదుపాయాల సంపదను సృష్టిస్తారని, వ్యవసాయ పనుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఉపాధి హామీకి హాలీడే ప్రకటిస్తారని మంత్రి తెలిపారు.
ఉపాధి పనుల హాలీడే ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తున్నట్లు తెలియజేశారు. గ్రామ పంచాయత్ ప్రణాళికలో భాగంగా ఆ పనులకు ఉపాధి హామీని వాడుకోవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు.
ALSO READ: ఇదేం చలి రా బాబు.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీని అభినవ గాడ్సేగా వర్ణించారు. అంతేకాదు నాథూరామ్‌కి వారసుడిగా ప్రస్తావించారు. ఆనాడు గాడ్సే.. మహాత్మాను భౌతికంగా హత్య చేస్తే, ఇవాళ బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్రపు లక్ష్యాలను, నేర్పిన సిద్ధాంతాలను తుడిచి పెట్టి ప్రధాని మరో హత్య చేస్తున్నారని ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.
ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడటం దేశ ద్రోహపు చర్యనేనని ప్రస్తావించారు. ఇది మహాత్మాకు NDA ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహమని రాసుకొచ్చారు. దీనికి ‘రామ్ – జి’ (రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్) పేరు పెట్టీ గాంధీజీని అవమానించాలని కుట్ర చేసినట్టు ఆరోపించారు. నరేగా పథకాన్ని RSS స్కీమ్‌గా మార్పు చేస్తున్నారని దుయ్యబట్టారు.
MGNREGA పథకానికి పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. 100 రోజుల పని దినాలను 125 రోజుల పెంచి గాంధీజీ పేరు మారుస్తారా ? మహాత్మా పేరు చెరిపేస్తే ఖర్చు తప్పా ప్రధానికి దక్కే లాభం ఏంటి ? స్వాతంత్ర్య సమరయోధుల మీద, మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపం? నరేగా పథకానికి బాపూజీ పేరు మార్చాలని చూసే కేంద్రం ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. దేరాష్ట్ర ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించాలని రాసుకొచ్చారు.
బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని @narendramodi మోడీ గారు అభినవ గాడ్సే. నాథూరామ్ కి వారసుడు. అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య చేస్తే, నేడు బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను,స్వాతంత్ర్యపు లక్ష్యాలను, నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోడీ గారు మరో హత్య చేస్తున్నారు.
ఉపాధి…
— YS Sharmila (@realyssharmila) December 16, 2025