Dwacra Womens Schemes: ఏపీలో తల్లికి వందనం స్కీమ్ ఇప్పటికే అమలు చేయనుండగా, ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది ప్రభుత్వం. డ్వాక్రా మహిళల కోసం తమ పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పేరిట ప్రారంభించనున్న ఈ పథకం ద్వారా, తక్కువ వడ్డీకే విద్యా రుణం అందే అవకాశం కలుగుతోంది. ఇది కేవలం స్కాలర్షిప్‌లు కాదు, ఇది ఆర్థికంగా వెనుకబడిన తల్లులకో గొప్ప భరోసా!
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మీ పిల్లల చదువుకు ప్రభుత్వం ఇప్పుడు నిలువెత్తు అండగా మారబోతోంది. పిల్లల విద్యార్థి భవిష్యత్తు కోసం మీరు ఇక అప్పుల బరువు మోసే అవసరం లేదు. స్త్రీనిధి బ్యాంక్ ద్వారా కేవలం 4% వడ్డీకే రూ.10,000 నుంచి లక్ష వరకు రుణం లభించనుంది. ఇది కేవలం రుణం కాదు, మీ ఆశలకు రూపం ఇచ్చే పథకం.
ఏంటి ప్రయోజనం?
తమ పిల్లల చదువు కోసం కలలు కన్నా ప్రతి తల్లి మాదిరిగానే, గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఈ ఆశలకు రూపం దాల్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త శుభవార్తను ప్రకటించబోతోంది. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళల పిల్లల విద్యా అవసరాల కోసం తక్కువ వడ్డీకే విద్యా రుణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే పేరును ఖరారు చేస్తూ, త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఈ పథకం లక్ష్యం..
డ్వాక్రా మహిళల కుటుంబాల్లోని పిల్లల చదువు ఖర్చు భారం తగ్గించడం. విద్యారంగంలో సమాన అవకాశాలు కల్పించడం. గ్రామీణ మహిళలకు ఆర్థికంగా సాయం చేయడం. ఈ మూడు అంశాల చుట్టూ తిరిగేలా ఈ పథకాన్ని రూపొందించారు.
ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా మహిళలకు సగటున 11 శాతం వడ్డీతో రుణాలు అందిస్తున్నారు. కానీ, తాజాగా ప్రవేశపెట్టబోయే ఈ కొత్త పథకంలో కేవలం 4 శాతం వడ్డీకే ( 35 పైసలు వడ్డీకి) విద్యా రుణం లభించనుంది. అంటే మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరించనుంది. ఇది ఒక కుటుంబానికి పెద్ద ఊరటే కాకుండా, తక్కువ ఖర్చుతో పిల్లల చదువు కొనసాగించేందుకు మార్గం కూడా.
ఎలా రుణం పొందవచ్చు?
స్త్రీనిధి బ్యాంక్ ద్వారా ఈ రుణం అందించనున్నారు. రుణ పరిమితి రూ.10,000 నుంచి గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు ఉంటుంది. రుణం తీసుకున్న మహిళలు తమ పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫార్మ్‌లు, రేషన్ ఖర్చులు, ప్రయాణానికి అవసరమైన సైకిళ్లు ఇలా విద్యకు సంబంధించిన అవసరాలకే వినియోగించాలి. ఒక్కో ఖర్చుకు సంబంధించి బిల్లులు, రసీదులను స్త్రీనిధి అధికారులకు సమర్పించాలి. దాని ఆధారంగా మాత్రమే రుణ నిబంధనలు అమలవుతాయి.
వీరంతా అర్హులే..
ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాదు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, టెక్నికల్ విద్యా సంస్థలు, వృత్తి విద్యా సంస్థలు, అన్నింటికీ వర్తిస్తుంది. అంటే కేజీ నుండి పీజీ వరకు చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఇదే కాదు, రుణం తిరిగి చెల్లించేందుకు కూడా ప్రభుత్వం మినహాయింపు, సౌలభ్యం కల్పించింది. మినిమం 24 నెలల నుండి గరిష్ఠంగా 36 నెలల వరకు వాయిదాలుగా చెల్లించవచ్చు. ఒకే సారి మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక కుటుంబానికి సాధ్యమైన విధంగా మెల్లమెల్లగా తిరిగి చెల్లించుకునే అవకాశం ఉంటుంది.
ప్రత్యేకంగా ఉద్దేశించిన దాని ప్రకారం, ప్రతి ఏడాది రూ.200 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇది ఒక స్థిరమైన, ఆచరణ సాధ్యమైన, ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పథకంగా అధికారులు వివరించారు. ఈ పథకం అమలైన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలు పిల్లల చదువు కోసం అప్పుల భారం లేకుండానే వారి భవిష్యత్తును మెరుగుపరచే అవకాశాన్ని పొందబోతున్నాయి.
Also Read: TTD Guidelines: తిరుమల క్యూలైన్‌లోకి వెళుతున్నారా? ఇవి తప్పక ముందే తెలుసుకోండి!
ఇదంతా డ్వాక్రా మహిళల త్యాగానికి, ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనంగా నిలుస్తుంది. ఇలాంటి పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పిల్లల చదువు కోసం మిగతా ఖర్చులు తగ్గించుకునే తల్లుల గుండెల్లో చిరునవ్వు చిందించేందుకు ఇది గొప్ప అవకాశం.
అర్హతలు ఇవే..
డ్వాక్రా సభ్యురాలై ఉండాలి. పిల్లలు పాఠశాలలో చేరి ఉండాలి. రుణం వినియోగం విద్యాపరమైన అవసరాలకే జరిగితేనే అనుమతి ఉంటుంది. రసీదులు, ఫీజు వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. సమయానికి వాయిదాలు చెల్లిస్తే మళ్లీ కొత్త రుణానికి అర్హత ఉంటుంది. ఈ పథకం గురించి పూర్తి సమాచారం కోసం స్త్రీనిధి కార్యాలయం, గ్రామ సచివాలయం సంప్రదించవచ్చు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే మీరు దరఖాస్తు చేసేందుకు సిద్ధం కండి.