Kadiyam Srihari: ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో.. టీడీపీ నుంచి కడియం శ్రీహరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో.. ప్రతిపక్షాల విమర్శలు తప్ప అవినీతి మరకలు లేని ఎడ్యుకేటెడ్ పొలిటిషన్ ఆయన. మహా మహా నాయకులను తట్టుకుని నిలబడ్డ కడియం పరిస్థితి.. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు తయారైందట. ఏం పని చేసినా, ప్రతిపక్షాల నుండి విమర్శలతో పాటు సొంత పార్టీ నాయకులకు కూడా టార్గెట్ అవుతూ తల్లడిల్లుతున్నారంట. అసలు ఆ మాజీ డిప్యూటీ సీఎంకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?
కాంగ్రెస్‌లో కడియం శ్రీహరికి ప్రతికూల పరిస్థితులు
మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి తెలియని వారు ఉండరు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో.. నో కాంప్రమైజ్ అంటూ తనకు తాను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి ఆరోపణలు, సొంత పార్టీ నాయకుల నుండి విమర్శలు ఎదుర్కొటున్నారట. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదురుకాని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారట.
ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతల నుంచి ఇబ్బందులు
గత సంవత్సర కాలంగా కడియం శ్రీహరిని ప్రతిపక్షాలతో పాటు, సొంత పార్టీ నేతలు సైతం నానాతిప్పలు పెడుతున్నారట. హస్తం పార్టీలోని కొందరు నేతలు కడియం చేరికపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి పార్టీలోకి వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఆగమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఆయన్ని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో పాటు, ఆయన కుమార్తె కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించి ఆ ఫ్యామిలీ పట్టు నిరూపించుకున్నారు.
కడియంపై రాజకీయం విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు
దాంతో తమ భవిష్యత్తుపై బెంగతో స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం.. సమయం దొరికినప్పుడల్లా ప్రతిపక్షాలకు దీటుగా కడియంపై.. రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. వీటన్నిటికీ తోడుగా దేవనూరు వినిపిరాతి గుట్టల భూముల విషయంలో.. కడియం శ్రీహరి కబ్జాలకు పాల్పడ్డారని తీవ్ర చర్చ జరిగింది. కడియం కుటుంబీకులు రైతుల భూములను.. బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బీఆర్ఎస్ నేతలతో పాటు సొంత పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం తీవ్రంగా ప్రచారం చేసింది. భూ కబ్జా ఆరోపణలను తట్టుకోలేక చివరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను తప్పు చేయలేదని కన్నీటి పర్యంతమయ్యారు కడియం.
సింగపురం ఇందిర, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు
భూకబ్జా ఆరోపణలు, విమర్శల నుండి కాస్త ఊరట లభించిందో లేదో.. ఇందిరమ్మ కమిటీలలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం ఇవ్వలేదని సొంత పార్టీ నేతలే కడియం తీరుపై రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. కడియం పార్టీ వ్యతిరేక పనులు చేస్తున్నాడని అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. స్టేషన్‌ఘపకపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ సింగపురం ఇందిర, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగానే.. తాజాగా, ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం కడియం శ్రీహరికి మరో తలనొప్పి తెచ్చిపెట్టిందట.
తన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని నిరసనలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులలో అసలైన పేదలను పక్కనపెట్టి, బీఆర్ఎస్ నుండి తనతో పాటు హస్తం పార్టీలోకి కలిసి వచ్చిన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న నిరుపేదలకు సైతం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని, చెట్ల కింద బతుకుతున్న తమకు కడియం శ్రీహరి అన్యాయం చేశాడని బాధితులు రోడ్లపైకి వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్లలో ఆర్ధికంగా బలంగా ఉన్న వారికి లబ్ధి
స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని విశ్వనాధపురంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి ఆర్థికంగా బలంగా ఉన్న వారినే లబ్ధిదారుల్లో చేర్చారని… కడియం శ్రీహరి తమ అన్యాయం చేశారని స్థానికులు వాపోతున్నారు. మొదటి విడత లబ్ధిదారుల ఎంపిక తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించి పంపిణీలో కడియం శ్రీహరి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి చుట్టూ ఉన్న అనుచరగణం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని, కడియం శ్రీహరికి తెలియకుండానే సంక్షేమ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. నయా పైసా అవినీతికి పాల్పడనని చెప్పుకునే కడియం శ్రీహరి ఇప్పుడు చేస్తున్నది ఏంటని బహిరంగంగానే నిలదీస్తున్నారు.
ఇందిరమ్మ ఇల్ల వ్యవహారంతో కడియంకు అవినీతి మరకలు
సొంత పార్టీ కాంగ్రెస్‌లోనే నేతల వ్యతిరేకతతో విసిగిపోయిన కడియం శ్రీహరికి, భూ కబ్జా ఆరోపణ నుండి బయటపడడానికి ప్రాణం పోయినంత పనైందని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వ్యవహారం ఆయనకు అవినీతి, అక్రమాల మరకలు అంటిస్తూ పెద్ద తలనొప్పిగా మారిందంట. మరి చూడాలి ఈ సమస్యల నుంచి ఆ సీనియర్ మోస్ట్ లీడర్ ఎలా బయటపడతారో?
-Story By Apparao, Bigtv Live