AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు నేడు(మే 13) పోలింగ్ జరగనుంది. మొత్తం 4.14 కోట్ల ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. 2.02 కోట్ల పురుష ఓటర్లు ఉండగా, 2.1 కోట్ల మహిళ ఓటర్లు ఉన్నారు. 3421 ట్రాన్స్ జెండర్స్ ఉండగా, 68,185 సర్వీస్ ఓటర్లు ఉన్నారు.
25 లోక్ సభ స్థానాలకు 503 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, 175 అసెంబ్లీ స్థానాలకు 2705 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభంకానుండగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది.
అధికార వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగగా.. ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాయి. వైసీపీ 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుండగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోంది.
Also Read: రాయలసీమలో సత్తా చాటేదేవరు..!
ఎన్నికల సజావుగా సాగేందుకు, కేంద్ర ఎన్నికల సంఘం 1.06 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఇందులో 3,500 మంది కర్ణాటక పోలీసులు, 4,500 మంది తమిళనాడు పోలీసులు, 1,614 మంది మాజీ సైనికులు, 246 మంది రిటైర్డ్ పోలీసు సిబ్బంది ఉన్నారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా ఆదివారం తెలిపారు.