AP Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈ నెల 20వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు కానుంది. ఎందుకంటే, ఏకంగా రెండు పథకాల నుంచి డబ్బు మీ ఖాతాలోకి జమ కానుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ పథకం అయిన పీఎం కిసాన్, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పథకం అన్నదాత సుఖీభవ. ఈ రెండు పథకాల మద్దతుతో ఒక్కరోజే ఆర్థిక సాయం లభించబోతోంది. ఇది కేవలం ఊహ కాదు, అధికారికంగా వెలువడిన సమాచారం ప్రకారం జూన్ 20న రైతులకు ఈ రెండు పథకాల ద్వారా ఆర్థికంగా అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండనున్నాయి.
రైతన్నా.. ఇవి తెలుసుకోండి
పీఎం కిసాన్ పథకం గురించి మాట్లాడుకుంటే, ఇది దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి మూడు విడతల్లో రూ.6,000 చెల్లించే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఇప్పటివరకు 16 విడతలు పూర్తవగా, ఇప్పుడు 17వ విడతగా రూ.2,000 జూన్ 20న ఖాతాల్లోకి రానుంది. ఈ పథకానికి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలు, ఆధార్ వివరాలు అప్‌డేట్‌గా ఉండాలన్నది ముఖ్యమైన అర్హత.
ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఊపిరి పోసేలా మరో చక్కటి పథకాన్ని తీసుకొచ్చింది.. అదే అన్నదాత సుఖీభవ. ఇది గతంలో అమలులో ఉండి తర్వాత నిలిపివేయబడిన పథకం. ఇప్పుడు మళ్లీ ప్రారంభించడంతో రైతుల్లో సంతోషం నెలకొంది. ఈ పథకం ద్వారా రైతులకు రూ.15,000 మూడుసార్లు చెల్లించనున్నారు. మొదటి విడతగా రూ.5,000 జూన్ 20న మీ ఖాతాలోకి చేరనుంది. రెండో విడత అక్టోబర్‌లో, మూడో విడత జనవరిలో జమ కానుంది. అయితే, పీఎం కిసాన్ నిధుల చెల్లింపు తేదీ మారితే, ఈ తేదీలలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
రెండు పథకాలు ఒకేసారి..
ఈ రెండు పథకాల నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. ప్రభుత్వం ప్రకారం, ఈ పథకాలకు రాష్ట్రంలో సుమారు 45.71 లక్షల మంది రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించబడ్డాయి. మీరు ఈ రెండు పథకాలకు ముందుగా నమోదు చేసుకుని ఉంటే, ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు.
మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఆధార్ మరియు ఖాతా లింకింగ్ పూర్తి అయినవేనా అనేది ధృవీకరించుకోవాలి. చాలా మందికి ఈ – కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉండవచ్చు. అందువల్ల రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించడం మంచిది.
ఈ వానాకాలానికి ముందే రూ.7,000 వస్తుందంటే గొప్ప విషయం. పంటల ఖర్చు కొంతవరకైనా తీరుతుందని రైతులు అంటున్న పరిస్థితి. అలాగే ఒకేసారి రెండు పథకాల డబ్బు రావడం ఇదే తొలిసారి. ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పాలసిందేనని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: AP Strange Village: ఏపీలో వింత గ్రామం.. ఇవేమి కట్టుబాట్లు.. ఆ గుట్టు ఇదే!
అకౌంట్ చెక్ చేసుకోండి
ఇవన్నీ చూస్తుంటే జూన్ 20 రైతులకు ఒక రైతు ఉగాది లాంటిది. ఒకవైపు విత్తనాలు, ఎరువులు, రైతు పనులకు ముందస్తు ఖర్చులు కావాల్సిన సమయం ఇది. అప్పుడు ప్రభుత్వాల మద్దతుగా నిధులు అందుతుండటం నిజంగా గొప్ప విషయం. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవలు కలిసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆశిద్దాం. జూన్ 20న ఉదయాన్నే మీ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయడం మర్చిపోకండి. డబ్బు రాకపోతే, నేరుగా మీ రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించండి.
ఈ రెండు పథకాల గురించి మరింత సమాచారం కోసం మీకు దగ్గరలోని గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాలను సంప్రదించండి. మొత్తం మీద ఒకేసారి రెండు స్కీమ్స్ పొందే అవకాశం ఏపీ రైతన్నలకు చేరువ కావడం గొప్ప విషయమే. మరెందుకు ఆలస్యం.. ఫోన్ మోగుద్ది.. అలర్ట్ గా ఉండండి.