– కల్లు గీత కార్మికులకు శుభవార్త
– మద్యం దుకాణాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
– 335 షాపులు కేటాయిస్తూ నిర్ణయం
– నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
– జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో త్వరలోనే లాటరీలు
– ఆ తర్వాత లైసెన్సుల ఎంపిక ప్రక్రియ
– ఒక్కో షాపు ఫీజు రూ.2 లక్షలు (నాన్ రిఫండబుల్)
– మేనిఫెస్టో హామీని నిలబెట్టుకున్న కూటమి పార్టీలు
– హర్షం వ్యక్తం చేస్తున్న గీత కార్మికులు, సంఘాలు
– దరఖాస్తు విధానం ఎలా?
– ప్రభుత్వ కండిషన్స్ ఏంటి?
AP Government: ఒక్కో హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టగా, తాజాగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కల్లు గీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశాయి. అందులో అనేక హామీలను గుప్పించాయి. ముఖ్యంగా సంక్షేమంలో భాగంగా బీసీలకు పెద్దపీట వేశాయి. 25 హామీలతో వారి కోసం కీలక హామీలు ఇచ్చాయి. వాటిలో గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రాయితీ ఒకటి. దానికి అనుగుణంగా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
335 షాపులు కేటాయిస్తూ ఉత్తర్వులు
కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 మద్యం షాపులు కేటాయిస్తూ, అబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3,396 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేసింది. వాటిలో 10 శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయిస్తోంది. దీనివల్ల గౌడ, ఈడిగ, యాత, శెట్టిబలిజ, గౌండ్ల, శెగిడి, గామల్ల కులాలకు లబ్ధి చేకూరనుంది.
మొత్తం 340 షాపులు
నిజానికి మొత్తం షాపుల్లో రాయితీ లెక్క చూస్తే 340 షాపులు కల్లు గీత కార్మికులకు దక్కుతాయి. అయితే, ఈమధ్య ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఓ కుటుంబానికి మద్యం దుకాణం కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే, ఉత్తరాంధ్రలో 4 షాపులను సొండి కులాల వారికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ 5 షాపులను మినహాయించి 335 దుకాణాలను కల్లు గీత కార్మికులకు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఒక షాపు మాత్రమే కేటాయిస్తారు. దీనిని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
2016 లెక్కల ప్రకారం షాపుల కేటాయింపు
రెండేళ్ల కాలానికి ఈ మద్యం దుకాణాల లైసెన్స్ జారీ చేస్తారు. లాటరీలో ఎక్కువ షాపులు వస్తే అభ్యర్థి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కల్లు గీత కులాల జనాభాపై 2016లో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వే ఆధారంగా షాపుల కేటాయింపు ఉంటుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని కులాలకు కేటాయించరు. వీరి వార్షిక లైసెన్స్ ఇతర షాపుల ఫీజుతో పోలిస్తే, 50 శాతం తక్కువగానే నిర్ణయించారు. ఒక షాపు నాన్ రిఫండబుల్ ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
దరఖాస్తు ఎలా?
కల్లు గీత కార్మికులకు ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. మద్యం షాపుల్లో 10 శాతం రాయితీతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నది. షాపులకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా లేదంటే హైబ్రిడ్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ కుల ధృవీకరణ పత్రాన్ని, నేటివిటీ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది. షాపులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తారు. లైసెన్స్ గడువు 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది.
తిరుపతి జిల్లా టాప్
కల్లు గీత కార్మికులకు అత్యధికంగా తిరుపతి జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు జరిగింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది.
జిల్లా షాపులు
తిరుపతి 23
నెల్లూరు 18
పశ్చిమ గోదావరి 18
ప్రకాశం 18
శ్రీకాకుళం 18
నెల్లూరు 18
విజయనగరం 16
కాకినాడ 16
అనకాపల్లి 15
అనంతపురం 14
విశాఖ 14
ఏలూరు 14
కడప 14
తూర్పుగోదావరి 13
కోనసీమ 13
గుంటూరు 13
పల్నాడు 13
బాపట్ల 12
కృష్ణా 12
ఎన్టీఆర్ 11
అన్నమయ్య 11
నంద్యాల 11
కర్నూలు 10
చిత్తూరు 10
శ్రీ సత్యసాయి 9
పార్వతీపురం మన్యం 4
అల్లూరి సీతారామరాజు 1
మంత్రి అనగాని హర్షం
కల్లు గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. కల్లు గీత కార్మికుల కుటుంబాల్లో అనందాన్ని నింపిన సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇది బీసీల ప్రభుత్వమని మరోసారి స్పష్టమైందని చెప్పారు. కుల వృత్తినే నమ్ముకుని ఇబ్బందులు పడుతున్న కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించడం చారిత్రక నిర్ణయమని కొనియాడారు.
గత ప్రభుత్వం చీప్ లిక్కర్‌ను తీసుకొచ్చి కల్లు గీత కార్మికులను రోడ్డున పడేగా, కూటమి ప్రభుత్వం మాత్రం వారికి షాపులు కేటాయించి ఆదుకుందని తెలిపారు. గత ప్రభుత్వం బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఆదరణ పథకాన్ని నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. కానీ, కూటమి ప్రభుత్వం గత 7 నెలల కాలంలో అన్ని రంగాల్లో బీసీలకు అధిక ప్రాధన్యత ఇస్తున్నదని వివరించారు. బీసీలతోపాటు అన్ని వర్గాలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.