AP government serious on Erra matti dibba real estate venchors
అవి శతాబ్దాల చరిత్ర కలిగిన ఆనవాళ్లు..భౌగోళిక వారసత్వ సంపదకు నిదర్శనాలు. అవే విశాఖ జిల్లాలో విస్తరించిన ఎర్రమట్టి దిబ్బలు. ప్రపంచంలోనే అరుదైన ఈ ప్రకృతి సహజ ఎర్రమట్టి దిబ్బలు కేవలం భారత దేశంలో రెండే ప్రాంతాలలో కనిపిస్తాయి. విశాఖ తీరం ఒకటైతే, తమిళనాడు తీరం మరొకటి. వాస్తవానికి ఈ తరహా మట్టిదిబ్బలు ప్రపంచం మొత్తం మీద మూడే ఉన్నాయి. శ్రీలంకలో మరొకటి ఉంది. గతంలో ఎర్ర మట్టి దిబ్బలలో చాలా సినిమాలు షూటింగులు జరుపుకున్నాయి. విదేశీయులు సైతం ముచ్చట పడి ఇక్కడ పర్యాటకులుగా వస్తుంటారు. పర్యాటకంగా ఆకర్షణీయ ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి ఎర్ర మట్టి దిబ్బల చుట్టూ ప్రస్తుత రాజకీయలు తిరుగుతున్నాయి.
1978 సంవత్సరంలో మూడు వేల ఎకరాలకు విస్తరించి ఉన్న ఈ ఎర్రమట్టి దిబ్బలపై ప్రభుత్వం నిషేధిత ప్రాంతంగా హెచ్చరిస్తూ దీనిని ఓ ప్రత్యేక జోన్ గా ప్రకటించింది.
పర్యావరణవేత్తల ఆందోళన
1982 సంవత్సరంలో భీమునిపట్నం ఎయిడెడ్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి దాదాపు 375 ఎకరాలను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ పాస్ చేసింది. అయితే జియోలాజికల్ సర్వే తెలిపిన అభ్యంతరాలతో తిరిగి 91 ఎకరాలను భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించి వెనక్కి తీసుకున్నారు. అయితే దీనిని ఆసరాగా తీసుకుని గత ఏపీ పాలకులైన జగన్ అండ్ కో యథేచ్ఛగా తవ్వకాలు ప్రారంభించారు. దీనితో పర్యావరణ వేత్తలు ఆందోళనలు చేశారు. జగన్ హయాం వచ్చేసరికి 3 వేల ఎకరాలు కాస్తా 120 ఎకరాలకు మారింది. ఇది పర్యావరణానికి ఎంతో ముప్పు అని..మన వారసత్వ సంపద మనకి కాకుండా పోతోందని అప్పట్లో పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలలో దీనిని ఖండిస్తూ వచ్చారు.
అక్రమార్కులకు నాటి జగన్ సర్కార్ అండ
జగన్ హయాంలో విశాఖ రాజధానిగా చేస్తున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో అక్కడ రియల్ ఎస్టేట్ రెక్కలు విప్పుకుంది. ఇక్కడ, అక్కడ అని కాకుండా విశాఖ జిల్లా మొత్తం ఎక్కెడెక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. దీనితో ఎర్రమట్టి దిబ్బలు చదును చేసే ప్రక్రియలో భాగంగా ఎత్తైన ప్రాంతాలు అంతరిస్తూ పోతున్నాయి. దీనిపై పర్యావరణ వేత్తల ఆందోళనలు రోజురోజుకూ ఎక్కువవడంతో ఏపీ సర్కార్ రియల్ వెంచర్లపై సీరియస్ అయింది. పైగా పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ దీనిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. నాటి ప్రభుత్వ మంత్రుల అండతో అడ్డగోలుగా వెంచర్లు వేయడానికి అనుమతి పొందారు రియల్టర్లు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా లంచాలు మరిగి ఎర్రమట్టి దిబ్బలలో వెంచర్లు వేసుకోవచ్చని రియల్ వ్యాపారులకు అనుమతులు ఇచ్చేశారు. ఇక నాటి వైఎస్ఆర్ సీపీ మంత్రుల అండ చూసుకుని అక్రమార్కులు తవ్వకాలను ప్రారంభించారు.
నిబంధనలకు విరుద్ధమే..
ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం ఎక్కడెక్కడ అక్రమంగా వెంచర్లు వేశారో గుర్తించే పనిలో నిమగ్నమయింది. అంతేకాదు తమ ప్రాధమిక విచారణలో అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని నివేదికను ఇచ్చారు.అధికారంలోకి రాకముందు ఎర్ర మట్టి దిబ్బలపై ఆక్రమణల గురించి విమర్శలు చేసిన నేటి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ఎర్రమట్టి దిబ్బ ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.