Bihar News: ప్రతీ మనిషికి జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి. ఈ లోకాన్ని విడిచి పెట్టేలోపు ఎలాగైనా వాటిని తీర్చుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం అనుక్షణం ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పైన కనిపిస్తున్న ఓ ఎయిర్‌ఫోర్సు మాజీ ఉద్యోగి ఆలోచన వెరైటీగా ఉంది. బతికుండగానే చితిపైకి వెళ్లే తతంగాన్ని కళ్లతో చూసి ఆనందించాడు. అసలు మేటరేంటి? అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
బీహార్‌లో విచిత్రమైన ఘటన
74 ఏళ్ల మోహన్‌లాల్ ఎయిర్‌ఫోర్సులో పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బీహార్‌లోని గయాజీ జిల్లా కొంచా గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. జీవితంగా అందరూ సెటిల్ అయిపోయారు. ఒకరు కలకత్తాలో డాక్టర్ కాగా, మరొకరు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. కూతురు ధన్‌బాద్‌లో ఫ్యామిలీతో ఉంటోంది. భార్య జీవన్ జ్యోతి 14 ఏళ్ల కిందట మరణించింది.
అప్పటి నుంచి పల్లెటూరులో కాలం గడిపేస్తున్నారు. పెన్షన్ తో వచ్చిన డబ్బును అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇటీవల వర్షాకాలంలో దహన సంస్కారాలకు గ్రామస్తులు చాలా ఇబ్బందిపడ్డారు. ఆ గ్రామ ప్రజల కోసం ముక్తిధామ్‌ను నిర్మించాడాయన. ఆయనకూ ఓ కోరిక ఉంది. నార్మల్‌గా చనిపోయిన తర్వాత వ్యక్తిని దహనం చేసే వరకు రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి.
బతికుండగానే చితిపైకి పెద్దాయన
బతికుండగానే తన అంతిమ సంస్కారాలను చూడాలని భావించాడు ఆయన. అందుకోసం ఆ గ్రామంలోని వారందరినీ ఆహ్వానించాడు. వందలాది మంది హాజరయ్యారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రామస్తులు మోహన్ లాల్ శవపేటికను పూలు-దండలతో అలంకరించారు. వాటిని తీసుకుని ముక్తిధామ్ వద్దకు చేరుకున్నారు.
శ్మశాన వాటికకు చేరుకున్న తర్వాత ఆయన దిష్టిబొమ్మని దహనం చేశారు. ఆ తర్వాత సామూహిక విందు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్‌లాల్.. తన గ్రామంలో ముక్తిధామ్ నిర్మించానని దాని ప్రారంభోత్సవం సందర్భంగా తొలుత తన సొంత అంత్యక్రియల ఊరేగింపును తీసుకెళ్లానని గుర్తు చేశారు.
ALSO READ: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల, ఏపీ-తెలంగాణల్లో ఎప్పుడంటే
తన చివరి ప్రయాణంలో చాలామంది ప్రజలు పాల్గొనడం చూసి తాను చాలా సంతోషంగా ఉన్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. చనిపోయిన తర్వాత ఎలా జరుగుతుందో తెలీదని, అందుకే ముందుగా ఆ ముచ్చట తీర్చుకున్నట్లు వెల్లడించాడు. తన మరణం తర్వాత ప్రజల ఆప్యాయత చూపిస్తారో కళ్లతో చూడాలనుకున్నానని తెలిపాడు. మొత్తానికి ఆ పెద్దాయన తన చివరి జర్నీని బతికుండగానే చూశాడన్నమాట.