Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా.. యూసుఫ్ గూడా డివిజన్‌లోని శ్రీ కృష్ణనగర్‌లో దోశ వేస్తూ ప్రచారం చేశారు మంత్రులు పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తాజాగా యూసుఫ్‌గూడా డివిజన్‌లో జరిగిన ప్రచార సభలో పొన్నం మాట్లాడుతూ.. తీవ్రస్థాయిలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ద్వారానే.. జూబ్లీహిల్స్ అభివృద్ధికి బాటలు పడతాయని స్పష్టం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఈ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. బీఆర్‌ఎస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మోసం చేశాయి. అభివృద్ధి పేరిట వాగ్దానాలు మాత్రమే ఇచ్చారు కానీ.. ఒక్క పని కూడా చేయలేదు అని మండిపడ్డారు.
కంటోన్మెంట్ ప్రజలు ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో.. అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అదే నమ్మకంతో జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు గెలుపు ఇవ్వాలని కోరుతున్నాం అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యం.. ప్రజల కోసం నిజమైన అభివృద్ధి, సదుపాయాలు తీసుకురావడమే మా ధ్యేయం. జూబ్లీహిల్స్ ప్రాంతానికి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మంచినీటి లైన్ల అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాం. మరింత విస్తృతంగా పనులు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. 12 సంవత్సరాలుగా కిషన్ రెడ్డి కేంద్రంలో ఉండి ఈ ప్రాంతానికి ఏమి తెచ్చారో ప్రజలకు చెప్పాలి. తమ శాసనసభ్యుడు రాజాసింగ్ స్వయంగా చెబుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని! బీజేపీకి ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కే వేసినట్టే అని ప్రజలే చెబుతున్నారు అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు, ఇవన్నీ ప్రజల జీవితాలను మారుస్తున్నాయి” అని వివరించారు.
కాంగ్రెస్ ఏం తప్పు చేసింది అని విమర్శించే ముందు, ప్రజలకు చేసిన మేలును చూసుకోవాలి. మా పార్టీ మాట ఇస్తే తప్పకుండా నిలబెడుతుంది అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ప్రశంసిస్తూ.. నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు, స్థానిక సమస్యలపై అవగాహన కలిగిన అభ్యర్థి. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు. ప్రజలు ‘చేతి గుర్తుకు’ ఓటు వేసి ఆయనను గెలిపిస్తే, మా ముఖ్యమంత్రి, మంత్రులు అందరం ఆయనకు అండగా ఉంటాం” అని భరోసా ఇచ్చారు.
Also Read: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. వరంగల్ అతలాకుతలం
ఈ నవంబర్ 11న జరగనున్న ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి. అభివృద్ధి, సంక్షేమం, సమానత్వం కోసం ఓటు వేయండి. జూబ్లీహిల్స్‌లో మార్పు కావాలి అంటే కాంగ్రెస్ తప్ప మరో మార్గం లేదు అని పేర్కొన్నారు.