BJP National President Elections | భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో కీలకమైన నాయకత్వ మార్పులు జరగనున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని 15 రోజుల్లోనే (మార్చి 15 2025 లోగా) నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జేపీ నడ్డా వారసుడు ఎవరు? నేషనల్ ప్రెసిడెంట్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ ప్రక్రియలో అధ్యక్ష పదవికి అనేక ప్రముఖ నేతల అర్హులని చర్చ జరుగుతోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త నాయకుడిని ఎంపిక చేయడానికి అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో మార్చి 15న కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలి. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మరో ఆరు రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్‌లను ఎన్నుకోవాల్సి ఉంది.
Also Read: భారత్‌లో మధ్యతరగతి ఆదాయం పెరగడం లేదు.. 50 ఏళ్ల కనిష్టానికి పొదుపు!
ఈ నేపథ్యంలో.. బీజేపీ తమ కార్యాచరణను వేగవంతం చేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలు రూపొందించింది. అదే సమయంలో, జాతీయ అధ్యక్షుడి పదవికి సూచించడానికి రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను బీజేపీ అధిష్ఠానం కోరింది.
మరోవైపు, బీజేపీ అధ్యక్షుడి పదవికి అనేక ప్రముఖ నేతల పేర్లు చర్చల్లో ఉన్నాయి. బీజేపీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత వినోద్ తావడే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. పార్టీకి విధేయుడిగా, మోదీ షా ద్వయానికి నమ్మకస్తుడిగా ఆయన మంచి పేరుంది. దీంతో ఆయనకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
2019లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా పార్టీ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి నడ్డా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో, కీలక బాధ్యతలు ఎవరికి అప్పగించబడతాయనేది చర్చల్లో ఉంది. బీజేపీ హైకమాండ్ అనేక నేతల పేర్లను పరిశీలిస్తోందని సమాచారం. రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను కూడా తమ దృష్టిలో ఉన్న వ్యక్తుల పేర్లను సూచించాలని కోరినట్లు తెలుస్తోంది.
Also Read: ఇడ్లీ సాంబార్‌తోనే విదేశీ పర్యాటకులు తగ్గిపోతున్నారు.. గోవా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు