AP Schools: ఏపీలో ఒంటి పూట బడులు ముందే ప్రారంభం కానున్నాయా? మండే ఎండలకు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. గత ఏడాది కూడా వేసవి కాలానికి సంబంధించి ఒంటిపూట బడులను ముందే ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
వేసవి కాలాన్ని తలపించేలా ఫిబ్రవరి మాసంలోనే ఎండలు భగభగమంటున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా, కూలీ నాలీ పనులు చేసుకునే ప్రజానీకంతో పాటు, విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మధ్యాహ్నం వేళ పాఠశాల నుండి గృహాలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు చెప్పలేనివి. ఉదయం 10 గంటలకే రహదారిపై నడిచేందుకు పెద్దలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఒంటిపూట బడుల అంశం ప్రస్తుతం తెర మీదికి వచ్చింది.
ఏపీలో గత పది రోజులుగా ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పవచ్చు. మార్చి నెలకు ముందుగానే భానుడి ప్రతాపం అధికం కావడంతో, ప్రజలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందే చర్యలపై దృష్టి సారించారు. మార్చి 15 నుండి ఒంటిపూట బడులను ప్రారంభించడం సర్వసాధారణమే. కానీ ఎండలను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది ముందుగానే ఒంటి పూట బడులను ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అదే రీతిలో ఒంటి పూట బడులను ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వేడిగాలుల ధాటికి సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏపీలో ఉంది. ఇది ఇలా ఉంటే వాతావరణ శాఖ అధికారులు సైతం.. ఎండలు విపరీతం కానున్నట్లు ఇప్పటికే ప్రకటన సైతం విడుదల చేశారు. ఎండల ధాటికి వడదెబ్బ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒంటిపూట బడులను ఫిబ్రవరి 25 నుండి అమలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: Pakistan Housemaid Murder : ఇంట్లో చాక్లెట్లు దొంగిలించిందని బాలిక హత్య.. పనిమనిషిపై ఓనర్ల కృూరత్వం
ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలలకు ఒక్క పూట బడి అమలు చేయాలన్న డిమాండ్ అధికంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థులకు ఒంటి పూట బడులపై అధికారిక గుడ్ న్యూస్ చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.