AP Govt New Scheme: ఏపీ మహిళలకు వరుస వరాలు కురిపిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఫ్రీ బస్ స్కీమ్ అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే సుమారు 2 లక్షల కుట్టు మిషన్లు మహిళలకు ఫ్రీగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మహిళలకు కోసం మరో స్కీమ్ పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనితో రాష్ట్రంలోని ఎన్నో పేద కుటుంబాలకు మేలు చేకూరనుందని చెప్పవచ్చు. ఇంతకు ఆ స్కీమ్ ఏంటో తెలుసుకుందాం.
మహిళలకే ప్రాధాన్యత..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల కోసం ఎన్నో స్కీమ్స్ తీసుకువచ్చింది. మొదట ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అలాగే వితంతు పింఛన్ లు వెంటనే మంజూరు చేయడం, ఉచిత కుట్టుమిషన్ శిక్షణ, త్వరలో ఫ్రీ బస్, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల పెంపు ఇలా ఎన్నో నిర్ణయాలను తీసుకొని మహిళా సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పవచ్చు.
మళ్లీ ఆ స్కీమ్ పునః ప్రారంభం..
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లుల కోసం రూపొందించిన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకంను మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 51.14 కోట్ల నిధులను సైతం విడుదల చేసింది. తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడే ఈ పథకం గతంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆ కిట్ లో ఏముంటాయి?
ప్రతి బేబీ కిట్ ఖర్చు రూ.1,410గా నిర్ణయించబడింది. తల్లులకు అవసరమైన ప్రతి అంశాన్ని ఇందులో చేర్చారు. బేబీకి ఆరోగ్యంగా వాతావరణం ఉండేందుకు దోమల నెట్‌తో కూడిన బేబీ బెడ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ కిట్‌లో దోమల నెట్‌తో కూడిన బేబీ బెడ్, 2 బేబీ డ్రెస్లు, 2 టవల్స్, 6 వాషబుల్ నాపీస్, బేబీ పౌడర్, షాంపూ, ఆయిల్, బేబీ సోప్, ప్లాస్టిక్ బాక్స్, చిన్న బొమ్మ ఉండనున్నాయి. ఈ కిట్ ద్వారా మాతా శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. మొదటి నుంచే శిశువు పరిశుభ్రతకు అలవాటు పడేలా, తల్లి శ్రమ తగ్గేలా పధకం రూపొందించబడింది.
పునఃప్రారంభంపై చర్చ..
ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకాన్ని అధికారికంగా త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన ప్రతి తల్లికి ఈ కిట్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ పథకం ఎందుకు?
ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు మేలు చేకూర్చనుంది. చాలామంది తల్లులు బేబీకి అవసరమైన వస్తువులను కొనలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఈ కిట్ పెద్ద ఆశ్రయంగా నిలుస్తుంది. పౌడర్, ఆయిల్ వంటి వ్యక్తిగత సంరక్షణ వస్తువులతోపాటు, చిన్న బొమ్మ కూడా పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుంది.
Also Read: AP Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు పథకం.. రేపో మాపో అధికారుల నివేదిక
ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు ఈ పథకం మళ్లీ రాకపోవచ్చేమో అనే ఆందోళనలో ఉండగా, ప్రభుత్వం మరోసారి దీన్ని పునఃప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి విడుదలైన నిధులు అన్ని జిల్లాలకూ పంపిణీ చేయడం, స్థానిక ఆసుపత్రులకు కిట్లు పంపిణీ చేయడం, క్వాలిటీని నిర్ధారించేందుకు ప్రత్యేక బృందాలు నియమించడం వంటి కార్యాచరణలు త్వరలో చేపట్టనుంది. అధికారిక లాంఛనంతో సీఎం చంద్రబాబు చేతులమీదుగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.