Eluru Dist: చుట్టూ గోదావరి వరద. బయటకు వెళ్లాలంటే మేళ్లవాగు వంతెన ఒక్కటే మార్గం. కానీ ఆ వంతెన కూడా వరదలో నీటమునిగింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ వ్యక్తికి గుండెనొప్పి వచ్చింది. స్థానికుల సాయంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లే మార్గంలో మృతిచెందాడు.
వరద నీటిలో గుండెపోటుతో వ్యక్తి మతి..
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరాపురం గ్రామానికి చెందిన కాకాని వెంకటేశ్వర్లుకు ఆదివారం మధ్యాహ్నం గుండెనొప్పి రావడంతో ఇంట్లో అందుబాటులో ఉన్న గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు. అయినప్పటికీ నొప్పి తగ్గలేదు. నొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లోనే సొమ్మసిల్లి పడిపోయాడు.
ఎత్తుకుని ఒడ్డుకు చేర్చిన స్థానికులు..
ట్రీట్‌మెంట్ కోసం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నా.. ఆ ఊరిని గోదావరి వరద చుట్టు ముట్టింది. అయినప్పటికీ బంధువులు గోదావరి వరదలో ప్రాణాలకు తెగించి, థర్మాకోల్ షీట్పై పడుకోబెట్టి వరద దాటించి, కన్నాయిగుట్ట వరకు చేరుకున్నారు. కన్నాయిగుట్టకు వెళ్ళాక అంబులెన్స్ కోసం అరగంట సేపు వేచి చూశారు. అంబులెన్స్ రాకపోవడంతో టూవీలర్‌పై కూర్చోబెట్టుకొని ఐదు కిలోమీటర్ల దూరంలోని బుర్రతోగు వరకు వెళ్లారు. అక్కడికి అంబులెన్స్ రావడంతో వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Also Read: తిరుమలలో భూతకోల నృత్య ప్రదర్శనపై వివాదం..
హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే.. వెంకటేశ్వర్లు మృతి..
అప్పటికే వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. మేళ్లవాగు వంతెన గోదావరి వరద నీటిలో మునగడం వల్ల చాగర పల్లి, బుర్రతోగు, భూదేవిపేట మీదుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది. అధికారులు కనీసం ఒక బోట్ కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల వైద్యం అందక నిండు ప్రాణం పోయిందనీ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.