AP Health Minister: తిరుపతిలో జరుగుతున్న భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమంలో.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, ఆరోగ్య పరిరక్షణలో యోగాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగాపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఇప్పటికే రెండు కోట్ల మంది యోగాలో పాల్గొన్నారని తెలిపారు. ఇది ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
యోగం అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, మానసిక, శారీరక ఆరోగ్యానికి పునాది అని అన్నారు. అయితే యోగాపై కనీస అవగాహన లేని వ్యక్తులు దానిపై మాట్లాడటం దురదృష్టకరమని, అలాంటి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని ఆరోపిస్తూ, ఆయనకు ప్రజల ఆరోగ్యంపై, అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంటే.. జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, అదే జగన్‌కు అసహనంగా మారిందన్నారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవగాహన రాహిత్యంతో కూడినవని, అవి రాజకీయ నిరాశను ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు.
మానసిక స్థితి సరిగా లేని వ్యక్తుల వ్యాఖ్యలను సమాజం గమనించి.. తగిన దూరం పెట్టాలని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎవరు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారో, ఎవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో ప్రజలకు బాగా తెలుసన్నారు. జగన్ పగటి కలలు కంటున్నారని, 2.0 అంటూ మళ్లీ అధికారంలోకి వస్తానని ఊహల్లో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2.0 కాదు, జగన్ వేసుకున్న ప్యాంటును కూడా ప్రజలు ఊడదీస్తారు అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.
గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం నిర్మించలేని మెడికల్ కాలేజీలను.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. మెడికల్ విద్యను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ, పేద ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.
వైసీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్య రాజకీయాలు చేయడం వల్లే.. ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో భయభ్రాంతులకు చోటులేదని, ప్రజల తీర్పే తుది తీర్పు అని పేర్కొన్నారు. కోటి సంతకాల వ్యవహారంపై కూడా మంత్రి తీవ్రంగా స్పందించారు. కోటి సంతకాలు ఎవరు పెట్టారో అర్థం కావడం లేదని, వైసీపీ నాయకులు తప్ప ఇంకెవ్వరూ కనిపించడం లేదని విమర్శించారు.
Also Read: అసలు మానవత్వం ఉందా..? నడిరోడ్డుపై గుండెపోటుతో కుప్పకూలిపోయినా..! చివరకు ఆయన నేత్రాలను..?
వైసీపీ పెంచుతున్న ఆత్మలు, బూతాత్మలే కోటి సంతకాలు పెట్టాయా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ అంశంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక సాగవని, నిజాలు బయటపడతాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి పారదర్శక పాలన అందిస్తోందని, అందుకే ప్రజల మద్దతు లభిస్తోందన్నారు.