మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రానంటున్నారు కానీ, గవర్నర్ తో టచ్ లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా కేవలం గవర్నర్ ప్రసంగం వరకే ఉండి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు పరుమార్లు గవర్నర్ ని నేరుగా కలసి వినతిపత్రాలు కూడా ఇచ్చి వచ్చారు. మరోసారి వారు అదే పనిమీద ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ కొంతకాలంగా వైసీపీ ఆందోళనలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టింది. ఈ కోటి సంతకాలు పూర్తయ్యాక దాన్ని ప్రజల రెఫరెండంగా గవర్నర్ కు సమర్పిస్తామంటున్నారు జగన్.
చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు కాదు కదా దూదికి కూడా దిక్కులేదు. మెడికల్ కాలేజీలను పూర్తి చేయాల్సింది పోయి ప్రైవేటుకు అమ్మేయడానికి సిద్ధపడుతున్నాడు చంద్రబాబు. దీన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతోంది.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ… pic.twitter.com/5y4AM6zLoi
— YSR Congress Party (@YSRCParty) October 23, 2025
రైతులపై జాలి లేదా?
తాజా ప్రెస్ మీట్ లో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారని విమర్శించిన జగన్, గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. పొలిటికల్ గవర్నరెన్స్ వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతోందని కూడా విమర్శించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకని పరిస్థితి ఉందన్నారు. రైతు బీమా సంగతి పట్టించుకోవడం లేదన్నారు. వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేయలేదని చెప్పారు. సబ్సిడీ విత్తనాలు ఇవ్వట్లేదని, ఉల్లి రైతులను గాలికి వదిలేశారన్నారు.
ఉద్యోగులకు మొండిచెయ్యి..!
ఉద్యోగులను సీఎం చంద్రబాబు మోసం చేశారని విమర్శఇంచిన జగన్, నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టి ఒక్కటి ప్రకటించారని అది కూడా నవంబర్‌లో ఇస్తామని ఇప్పుడు ప్రకటించారని మండిపడ్డారు. డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని, చివరకు ఉద్యోగులు గొడవ చేయడం వల్ల దిగివచ్చారని అన్నారు. కానీ తమ హయాంలో కొవిడ్ కష్టాలున్నా వెనకడుగు వేయలేదని, ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే తాము 11 ఇచ్చామని చెప్పుకొచ్చారు. జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదని, ఐఆర్ గురించి కూడా ప్రస్తావన లేదని, ఉద్యోగులకు జీపీఎస్, ఓపీఎస్ రెండూ లేకుండా చేశారన్నారు. కూటమి హయాంలో ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారని చెప్పారు జగన్.
చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు పెండింగ్ డీఏలు 4 ఉన్నాయి. ఉద్యోగులంతా రోడ్డెక్కాక ఒక్క డీఏ ప్రకటించారు కానీ ఇప్పటివరకూ ఇవ్వలేదు. పైగా అరియర్స్ అన్నీ రిటైర్మెంట్ తర్వాత ఇస్తాను అన్నాడు. దీన్నే దీపావళి కానుక అని ప్రచారం చేశాడు. కోవిడ్ కష్టాలున్నా కూడా మేము 11 డీఏలు ఇచ్చాం. GPS లేదు.… pic.twitter.com/ujWYG9P59R
— YSR Congress Party (@YSRCParty) October 23, 2025
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలోనే కనిపిస్తున్నాయని విమర్శించారు జగన్. ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయని, ఇంగ్లిష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయని, గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయిందని విమర్శించారు జగన్. విద్యాదీవెన, వసతి దీవెన ఇవ్వట్లేదన్నారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చారని, చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రుల్లో ధర్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కలేదన్నారు జగన్.
Also Read: ఆ ఘనత మాదే.. వైజాగ్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై జగన్ యూ టర్న్
నిన్న మొన్నటి వరకు సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని అనేవారు జగన్. నేడు తాను పెట్టిన పథకాలను అమలు చేయట్లేదని అంటున్నారు. ఒకరకంగా జనం, జగన్ పథకాలు వద్దని, చంద్రబాబు ప్రవేశ పెట్టే పథకాలు కావాలని గతేడాది అలాంటి తీర్పునిచ్చారు. మరి ఇంకా జగన్ తన పథకాలను, చంద్రబాబు అమలు చేయడం లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు నెటిజన్లు.