Amaravati: ఏపీ స్థానిక సంస్థలు ఎన్నికలు రెండొంతులు పూర్తి అయ్యాయి. ఇక మిగిలింది పంచాయతీ ఎన్నికలు మాత్రమే. కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికలు పూర్తి కావడంతో ప్రభుత్వంతోపాటు పార్టీల నేతలు ఊపిరి పీల్చుకున్నారు. జెడ్పీటీసీల్లో జోరు కొనసాగించిన కూటమి పార్టీలు, ఎంపీటీఎసీల్లో ఎందుకు తగ్గిందనేది అసలు ప్రశ్న. ఈ క్రమంలో ఆ జిల్లాల్లో మార్పులు చేర్పులు తప్పవా? అవుననే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సడలుతున్నట్లు తాజా ఫలితాల ద్వారా రుజువు చేస్తోంది. నగరాలు, పట్టణాలు ఎన్నికలను కాసేపు పక్కన పెడదాం. పరిషత్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్ల శైలి స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో కూటమి పట్టు సడలుతోంది.
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ-406, వైసీపీ-76, జనసేన- 73, బీజేపీ-20, స్వతంత్రులు-6, సీపీఐ(ఎం) ఒక స్థానంలో గెలుపొందాయి. ఒక విధంగా చెప్పాలంటే జెడ్పీటీసీ ఫలితాలకు కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. దాదాపు 80 శాతం ఫలితాలను గెలుచుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జెడ్పీ ఫలితాల విషయంలో కూటమి నాయకులు ఫుల్‌ఖుషీ.
ఎంపీపీ ఎన్నికలు కూటమి కంటే టీడీపీకి ఎక్కువగా మింగుడుపడడం లేదు. ఏపీ వ్యాప్తంగా 7,768 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ-4,806, వైసీపీ-1,711, జనసేన-938, బీజేపీ-117, స్వతంత్రులు- 169, కాంగ్రెస్-9, సీపీఎం-15, బీఎస్పీ- 3 స్థానాలు దక్కించు కున్నాయి. ఎంపీపీ ఫలితాలు టీడీపీకి మింగుడు పడడం లేదు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ, పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు వదులు కోవాల్సి వచ్చింది.
బలమైన కేడర్ ఉన్న దగ్గర సీట్లను కూటమి పార్టీలకు ఇవ్వడంతో అక్కడ వైసీపీ విజయం సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీదే పైచేయి. పార్టీ నుంచి నేతలకు ఎలాంటి ఆర్థిక మద్దతు లేదు. వారు సొంతంగానే ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో పార్టీ నుంచి కేడర్‌కు ఆర్థిక భరోసా ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ALSO READ: పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్.. ఇద్దరు మాజీ ఎంపీల ఓటమి, ఎక్కడెక్కడ?
ఎంపీటీసీ ఫలితాల్లో కూటమి పెర్ఫార్మన్స్ ఎందుకు తగ్గింది అనేదానిపై తక్షణం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తొలుత అల్లూరి సీతారామరాజు జిల్లా విషయానికి వద్దాం. ఆ జిల్లాలో 172 స్థానాలకు వైసీపీ ఏకంగా 89 సీట్లను గెలుచుకుంది. అందులో TDP-46, జనసేన-12, BJP- 6, స్వతంత్రులు-16, CPM- 2, కాంగ్రెస్‌కు ఒకటి వచ్చాయి. స్వతంత్రులు 16 మంది గెలిచారంటే ఆ జిల్లాలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక అన్నమయ్య జిల్లాలో అయితే టీడీపీ కంటే వైసీపీకి ఒక సీటు ఎక్కువ గెలుచుకుంది. ఆ జిల్లాలో 147 స్థానాలకు గాను YCP-69, TDP-68, జనసేన-6 ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. అన్నమయ్య జిల్లా ఫలితాలే పోలవరం జిల్లాలో రిపీట్ అయ్యాయి. ఆ జిల్లాలో 101 సీట్లకు గాను YCP-41, TDP- 40, జనసేన- 8, బీజేపీ-4, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఒక్కో సీటు గెలుచుకున్నారు.